జ్యోతి మల్హోత్రా ఫోన్, ల్యాప్‌టాప్‌లో 12 టీబీల డేటా: పాక్ ఏజెంట్లతో నేరుగా చాటింగ్!

  • పాక్ ఐఎస్‌ఐతో మాట్లాడుతున్నానని జ్యోతికి ముందే తెలుసన్న దర్యాప్తు వర్గాలు!
  • జ్యోతి గ్యాడ్జెట్ల నుంచి 12 టెరాబైట్ల సమాచారం స్వాధీనం
  • నలుగురు పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు
  • వీసా కోసం వెళ్లినపుడు పాక్ హైకమిషన్‌లో ట్రాప్ అయిన వైనం
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను సంప్రదిస్తున్న పాకిస్థానీ అధికారులు ఐఎస్‌ఐతో కలిసి పనిచేస్తున్నారన్న విషయం జ్యోతికి ముందే తెలుసని దర్యాప్తు సంస్థల వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ ఆమె ఏమాత్రం భయపడకుండా వారితో సంబంధాలు కొనసాగించినట్లు పేర్కొన్నాయి.

జ్యోతి మల్హోత్రా నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా అధికారులు కీలక సమాచారాన్ని గుర్తించారు. ఆమె ఇదివరకే డిలీట్ చేసిన డేటాను కూడా అధికారులు రికవరీ చేశారు. ఈ డేటా మొత్తం సుమారు 12 టెరాబైట్ల వరకు ఉందని సమాచారం. ఈ భారీ డేటాను ప్రస్తుతం అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తాను ఐఎస్‌ఐకి చెందిన వ్యక్తులతోనే మాట్లాడుతున్నానని స్పష్టంగా తెలిసినప్పటికీ జ్యోతి వారితో సంబంధాలు కొనసాగించినట్లు ఈ డేటా ఆధారంగా ప్రాథమికంగా నిర్ధారించారు.

జ్యోతి మల్హోత్రా నేరుగా నలుగురు పాకిస్థానీ ఐఎస్‌ఐ ఏజెంట్లతో మాట్లాడినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. వీరిలో డానిష్, అహ్సాన్‌, షాహిద్ అనే ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి. ఐఎస్‌ఐలో ఈ ఏజెంట్ల హోదాలు, వారి బాధ్యతలు ఏమిటనేది నిర్ధారించుకునే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

మరోవైపు, జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో ఉన్న సమయంలో ఆరుగురు వ్యక్తులు ఏకే47 తుపాకులతో ఆమెకు భద్రత కల్పించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వారు ధరించిన జాకెట్లపై "నో ఫియర్‌" అని రాసి ఉండటం గమనార్హం. 2023లో వీసా కోసం పాకిస్థాన్ హైకమిషన్‌కు వెళ్లినప్పుడు తనకు తొలిసారిగా డానిష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడని జ్యోతి విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని డానిష్ ట్రాప్ చేసి, వారిని గూఢచర్యం కోసం వాడుకునేవాడని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లగా, ఆమెను డానిష్ తన వలలో వేసుకున్నట్లు తెలుస్తోంది.


More Telugu News