పోలీసులతో వాగ్వాదానికి దిగిన వల్లభనేని వంశీ భార్య

  • గుంటూరు జీజీహెచ్ లో వంశీకి వైద్య చికిత్స
  • భర్తను కలిసేందుకు వచ్చిన పంకజశ్రీ
  • వంశీని కలవకుండా అడ్డుకున్న పోలీసులు
నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను పోలీసులు గుంటూరులోని జీజీహెచ్ కు తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.

ఈ విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా చూసేందుకు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకున్నారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంశీని కలిసేందుకు పంకజశ్రీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం వంశీకి వైద్యం అందిస్తున్నారని, ఈ సమయంలో ఎవరినీ కలిసేందుకు అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు, పంకజశ్రీకి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అయినప్పటికీ, పోలీసులు ఆమెను లోనికి అనుమతించకపోవడంతో, పంకజశ్రీ ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దే ఉండిపోయారు.


More Telugu News