ఒకప్పుడు ఇది ఊహకు మాత్రమే పరిమితమైన విషయం: ఆనంద్ మహీంద్రా

  • జీడీపీలో జపాన్‌ను అధిగమించిన భారత్
  • ఇది భారతీయుల ప్రతిభ, ఆశయాలకు నిదర్శనమన్న ఆనంద్ మహీంద్రా
  • ప్రస్తుత విజయంతో సంతృప్తి చెందవద్దని సూచన
  • జర్మనీని దాటడం కాదు... తలసరి ఆదాయం పెరగాలని వ్యాఖ్యలు
  • నిరంతర ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని ఉద్ఘాటన
భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంపై ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జపాన్ ను భారత్ అధిగమించడం అనేది ఒకప్పుడు ఊహకు మాత్రమే పరిమితమైన విషయం అని, ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించడం వెనుక లక్షలాది భారతీయుల ప్రతిభ, ఆశయం, కృషి ఉన్నాయని కొనియాడారు.

తాను బిజినెస్ స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో, జీడీపీలో భారత్ జపాన్‌ను అధిగమిస్తుందనే ఆలోచన ఒక సుదూర స్వప్నంలా, దాదాపు అసాధ్యమైన కోరికలా అనిపించేదని ఆనంద్ మహీంద్రా గుర్తుచేసుకున్నారు. "కానీ ఈ రోజు, ఆ మైలురాయి ఇకపై సిద్ధాంతపరమైనది కాదు... మనం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం" అని ఆయన తెలిపారు. 

ఇది చిన్న విజయం కాదని, జపాన్ చాలా కాలంగా ఆర్థిక దిగ్గజంగా, అద్భుతమైన ఉత్పాదకత, స్థితిస్థాపకత కలిగిన దేశంగా పేరుగాంచిందని వివరించారు. అలాంటి దేశాన్ని మనం అధిగమించడం వివిధ రంగాలు, తరాలు, ప్రాంతాలకు చెందిన లక్షలాది భారతీయుల అంకితభావానికి నిదర్శనమని ప్రశంసించారు.

అయితే, ఈ విజయాన్ని మనం వేడుకగా జరుపుకుంటున్నప్పటికీ, ఇది చాలదన్న కసితోనే ఉండాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. "ఎందుకంటే భారతదేశం తదుపరి ఘనత జర్మనీని అధిగమించడం కాదు, తలసరి జీడీపీలో వృద్ధి సాధించడం" అని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందాలంటే పాలన, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, విద్య, మూలధన లభ్యత వంటి కీలక రంగాల్లో నిరంతర ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఈ సంస్కరణలే దేశ భవిష్యత్ ప్రగతికి మార్గం సుగమం చేస్తాయని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.


More Telugu News