మాకు ఒకటే... మీకు రెండు... బంగ్లాదేశ్ కు అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన అసోం సీఎం

  • బంగ్లాదేశ్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర వ్యాఖ్యలు
  • భారత వ్యతిరేక విధానాలు మానుకోవాలని బంగ్లాకు హితవు
  • సిలిగురి కారిడార్‌కు దగ్గర్లో చైనా సాయంతో బంగ్లా ఎయిర్‌బేస్ నిర్మాణంపై ఆందోళన
  • భారత సైనిక శక్తిని గుర్తుచేస్తూ బంగ్లాదేశ్‌కు పరోక్ష హెచ్చరిక
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. "భారతదేశానికి ఒక చికెన్ నెక్ (సిలిగురి కారిడార్) ఉంటే, బంగ్లాదేశ్‌కు అలాంటివి రెండున్నాయి... మమ్మల్ని దెబ్బతీయాలనుకుంటే మీకే నష్టం" అంటూ ఆ దేశపు వ్యూహాత్మక బలహీనతలను గుర్తుచేశారు. చైనా సహకారంతో బంగ్లాదేశ్ తన లాల్‌మొనిర్‌హాట్ వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తుండటం, ఇది భారత్ యొక్క కీలకమైన సిలిగురి కారిడార్‌కు సమీపంలో ఉండటంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో హిమంత వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సిలిగురి కారిడార్, ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే అత్యంత కీలకమైన, సన్నని భూభాగం. దీనికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో, చైనా ఆర్థిక, సాంకేతిక సహకారంతో లాల్‌మొనిర్‌హాట్ వైమానిక స్థావరాన్ని బంగ్లాదేశ్ ఆధునీకరించడంపై భారత్ వ్యూహాత్మక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ పరిణామాలపై స్పందిస్తూ, హిమంత బిశ్వ శర్మ, "భారతదేశంపై దాడి చేయాలని ఆలోచించే ముందు బంగ్లాదేశ్ ఒకటికి 14 సార్లు పునరాలోచించుకోవాలి. మాకు ఒక చికెన్ నెక్ ఉంటే, మీకు రెండున్నాయి. మీ చిట్టగాంగ్ ఓడరేవును కలిపే మార్గం మా సిలిగురి కారిడార్ కంటే సన్నగా ఉంది, అది మాకు కేవలం రాయి విసిరేంత దూరంలోనే ఉంది" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత సైనిక శక్తిని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇటీవల పాక్ భూభాగంలోని 11 వైమానిక స్థావరాలను భారత్ ఎలా ధ్వంసం చేసిందో (ఆపరేషన్ సిందూర్) బంగ్లాదేశ్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

బంగ్లాదేశ్ 'చికెన్ నెక్‌లు' ఇవే...
భౌగోళికంగా బంగ్లాదేశ్‌కు కూడా వ్యూహాత్మకంగా బలహీనమైన ప్రాంతాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
1. చిట్టగాంగ్ కారిడార్: బంగ్లాదేశ్ ప్రధాన భూభాగం నుంచి చిట్టగాంగ్ ప్రాంతాన్ని, ముఖ్యంగా దేశానికి కీలకమైన చిట్టగాంగ్ ఓడరేవును కలిపే భూమార్గం చాలా సన్నగా ఉంటుంది. ఇది త్రిపుర రాష్ట్రానికి సమీపంలో, మేఘాలయలోని నైరుతి గారో హిల్స్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ వరకు సుమారు 90 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. దేశ భూభాగంలో దాదాపు 20% ఉండే ఈ ప్రాంతం దాదాపు వేరుపడినట్లుగా కనిపిస్తుంది.
2. రంగ్‌పూర్ డివిజన్: బంగ్లాదేశ్‌లోని వాయువ్య ప్రాంతంలో ఉన్న రంగ్‌పూర్ డివిజన్ కూడా భౌగోళికంగా సన్నగా ఉండి, మేఘాలయ రాష్ట్రానికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం చైనా సహకారంతో పునర్నిర్మిస్తున్న లాల్‌మొనిర్‌హాట్ వైమానిక స్థావరం ఈ రంగ్‌పూర్ డివిజన్ పరిధిలోనే ఉంది.




More Telugu News