రాఖీ డెలివరీ చేయని అమెజాన్‌కు షాక్.. రూ. 40 వేల జరిమానా

  • అమెజాన్‌కు ముంబై వినియోగదారుల ఫోరం షాక్
  • 2019లో బుక్ చేసిన రూ.100 రాఖీ 
  • డెలివరీ చేయకుండా ఆర్డర్ రద్దు చేసిన అమెజాన్
  • సేవా లోపంగా నిర్ధారించిన ఫోరం
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు ముంబై జిల్లా వినియోగదారుల ఫోరం గట్టి షాకిచ్చింది. సకాలంలో రాఖీ డెలివరీ చేయడంలో విఫలమైనందుకు గాను, ఆ సంస్థకు రూ.40,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 2019లో జరిగిందీ ఘటన. వినియోగదారు ఆర్డర్ చేసిన రాఖీని నిర్దేశిత గడువులోగా అందించకపోగా, ఆర్డర్‌ను రద్దు చేసి డబ్బులు వాపసు చేయడం సేవా లోపం కిందకే వస్తుందని ఫోరం స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళ తన మేనల్లుడి కోసం 2019 ఆగస్టు 2న అమెజాన్ వెబ్‌సైట్‌లో ఒక రాఖీని ఆర్డర్ చేశారు. ధనశ్రీ రాఖీ షాపు నుంచి రూ.100 విలువైన 'మోటూ పట్లూ కిడ్స్ రాఖీ'ని ఆమె ఎంచుకున్నారు. ఆగస్టు 8 నుంచి 13వ తేదీ మధ్య రాఖీని డెలివరీ చేస్తామని అమెజాన్ నుంచి ఆమెకు సందేశం అందింది. అయితే, చెప్పిన తేదీల్లో రాఖీ డెలివరీ కాలేదు. ఆ మరుసటి రోజే రాఖీ కోసం చెల్లించిన రూ.100 ఆమె బ్యాంకు ఖాతాలో తిరిగి జమ అయ్యాయి. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సదరు మహిళ తనకు జరిగిన అన్యాయంపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును విచారించిన ముంబై జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు సమీందర్ ఆర్. సుర్వే, సభ్యుడు సమీర్ కె. కాంబ్లేతో కూడిన ధర్మాసనం అమెజాన్ వైఖరిని తప్పుబట్టింది. రూ.100 విలువైన రాఖీని ఆర్డర్ తీసుకున్న అమెజాన్ సంస్థ, దానిని నిర్ణీత గడువులోగా అందించడంలో విఫలమైందని పేర్కొంది. అంతేకాకుండా, డెలివరీ చేయకుండా మరుసటి రోజే ఆర్డర్‌ను రద్దు చేసి, డబ్బులను ఖాతాదారురాలి బ్యాంకు ఖాతాలో తిరిగి జమచేయడం సరికాదని అభిప్రాయపడింది. రాఖీని సకాలంలో చేరవేయకపోవడాన్ని తీవ్రమైన సేవా లోపంగా పరిగణించిన ఫోరం.. అమెజాన్ సంస్థ బాధితురాలికి రూ.40,000 జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News