మంచు మ‌నోజ్‌పై నారా రోహిత్ ఎమోష‌న‌ల్ పోస్ట్

  • నిన్న ఏలూరులో 'భైర‌వం' ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌
  • ఈ ఈవెంట్ నేప‌థ్యంలో మ‌నోజ్‌ను ఉద్దేశిస్తూ రోహిత్ ట్వీట్‌
  • ఏది ఏమైనా, విష‌యం ఏదైనా.. మ‌నోజ్‌కు తోడుగా ఉంటాన‌న్న హీరో
మంచు మ‌నోజ్‌ను ఉద్దేశించి న‌టుడు నారా రోహిత్ 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. ఏది ఏమైనా మ‌నోజ్‌కు అండ‌గా ఉంటాన‌ని అన్నారు. ఆదివారం జ‌రిగిన 'భైర‌వం' ఈవెంట్‌ను విజ‌య‌వంతం చేసిన ఏలూరు ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 

"నిన్న ఏలూరులో 'భైరవం' ఈవెంట్‌తో అద్భుతమైన సాయంత్రాన్ని ఆస్వాదించాం. ఈ ఈవెంట్‌ను ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు ఏలూరు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బాబాయ్ మంచు మ‌నోజ్ ప్ర‌త్యేకంగా నిలిచాడు. ఆయ‌న‌ ప్రసంగం శక్తివంతమైంది, భావోద్వేగభరితమైంది, హృదయాన్ని కదిలించేదిగా ఉంది. ఏది ఏమైనా, విష‌యం ఏదైనా.. నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను బాబాయ్. ల‌వ్ యూ!" అని రోహిత్ త‌న ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. 

కాగా, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన‌ తాజా చిత్రం 'భైర‌వం'. ఈ మూవీ ట్రైల‌ర్ లాంచ్‌ ఈవెంట్ ఆదివారం ఏలూరులో జ‌రిగింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ కింద కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ కనకమేడల దర్శకుడు. 

ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఈవెంట్‌లో ఆయ‌న‌పై ఓ వీడియో (ఏవీ) ప్ర‌ద‌ర్శించ‌గా.. అది చూసి మంచువారబ్బాయి చ‌లించిపోయాడు. ఎమోష‌న్ ఆపుకోలేక క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. 

ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ తెర మీదికి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమని చెప్పుకొచ్చాడు. సొంత‌వాళ్లే దూరం పెడుతున్న ఈ రోజుల్లో అభిమానులు త‌న‌పై ప్రేమ కురిపిస్తున్నార‌ని ఎమోష‌నల్‌ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. 


More Telugu News