ఆసియాలోనే పెద్ద మార్కెట్ కళావిహీనం.. మామిడి రైతులకు నిరాశ!

  • నున్న మామిడి మార్కెట్‌లో ఈ ఏడాది అమ్మకాలు డీలా
  • కోడిపేను తెగులు, అకాల వర్షాలతో మామిడి పంటకు దెబ్బ
  • గణనీయంగా పడిపోయిన మామిడి ఎగుమతులు
  • బంగినపల్లి, రసాల ధరలు సగానికి సగం తగ్గుదల
  • దిగుబడి తగ్గి, ధరలు లేక రైతులు, వ్యాపారుల ఆందోళన
  • ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌లో  సంక్షోభం
విజయవాడ రూరల్‌లోని ప్రఖ్యాత నున్న మామిడి మార్కెట్‌ ఈ ఏడాది తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆసియాలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన ఈ మార్కెట్‌ ప్రస్తుతం కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. గత దశాబ్ద కాలంలో, కరోనా సమయాన్ని మినహాయిస్తే, ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, గాలివానలు, కోడిపేను వంటి తెగుళ్ల కారణంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గడమే కాకుండా, నాణ్యత కూడా దెబ్బతింది.

ఈ సంవత్సరం మామిడి పూత బాగానే ఉన్నప్పటికీ, కాయ దశకు వచ్చేసరికి కోడిపేను తెగులు సోకి పూతంతా మాడిపోయింది. దీనికి తోడు అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను మరింత దెబ్బతీశాయి. దీంతో మార్కెట్‌కు వచ్చే మామిడి కాయల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతంలో సీజన్‌లో రోజుకు 400 నుంచి 500 టన్నుల మామిడి ఎగుమతి కాగా, ప్రస్తుతం రోజుకు 200 టన్నులు దాటడమే గగనంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు.

ధరల విషయంలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో సీజన్ ప్రారంభం, ముగింపులో టన్ను బంగినపల్లి, రసాల రకం మామిడి రూ.50 వేల నుంచి రూ.55 వేల వరకు పలికేది. సీజన్ మధ్యలో కూడా రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ధర ఉండేది. కానీ, ఈ ఏడాది అత్యుత్తమ నాణ్యత కలిగిన మామిడి పండ్లకు కూడా టన్నుకు రూ.25 వేలు పలకడం కష్టంగా మారింది. ఇక నాణ్యత తక్కువగా ఉన్న కాయలైతే రూ.10 వేల నుంచి రూ.15 వేలకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో మామిడి రైతులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


More Telugu News