అమెరికాలో పర్వతారోహణకు వెళ్లి తెలుగు ఇంజినీర్ సహా ముగ్గురు మృతి

  • అమెరికాలోని వాషింగ్టన్‌లో పర్వతారోహణ బృందానికి ప్రమాదం
  • భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు మృతి
  • సియాటెల్‌లో ఫ్లూక్‌ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న విష్ణు
  • ప్రతికూల వాతావరణంలో యాంకర్ పాయింట్ అదుపు తప్పడంతో దుర్ఘటన
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో భారత సంతతికి చెందిన ప్రముఖ ఇంజినీర్ సహా ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి మృతి చెందారు.

సియాటెల్‌లో నివసిస్తున్న 48 ఏళ్ల విష్ణు, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నార్త్ క్యాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పియర్స్ ప్రాంతానికి పర్వతారోహణకు వెళ్లారు. పర్వతాన్ని అధిరోహించి, కిందకు దిగుతున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో ప్రమాదం సంభవించింది. వారు ఉపయోగించిన యాంకర్ పాయింట్ అదుపు తప్పి, సుమారు 200 అడుగుల లోయలో పడిపోయారు.

ఈ దుర్ఘటనలో విష్ణు ఇరిగిరెడ్డితో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, బృందంలోని నాలుగో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ, ఆ యువకుడు సుమారు 64 కిలోమీటర్ల ప్రయాణించి, సురక్షిత ప్రాంతానికి చేరుకుని అధికారులకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. ఆయన అందించిన వివరాలతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రెస్క్యూ బృందాలు హెలికాప్టర్ల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీశారు.

విష్ణు ఇరిగిరెడ్డి, సియాటెల్‌లోని ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన తన రంగంలో నిష్ణాతుడిగా పేరుపొందడమే కాకుండా, గ్రేటర్ సియాటెల్ ప్రాంతంలో జరిగే పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. విష్ణు మరణవార్త ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.


More Telugu News