ఈశాన్య భారత్‌పై మళ్లీ బంగ్లాదేశ్‌ పాలకుడు యూనస్ వ్యాఖ్యలు

  • బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత యూనస్ మళ్ళీ భారత ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన
  • నేపాల్ డిప్యూటీ స్పీకర్‌తో భేటీలో ఆర్థిక సమైక్యతపై వ్యాఖ్యలు
  • గతంలో చైనా పర్యటనలోనూ ఈశాన్యంపై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు
మనదేశ ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేపాల్ డిప్యూటీ స్పీకర్‌తో జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్, నేపాల్, భారత ఈశాన్య రాష్ట్రాల మధ్య సమగ్ర ఆర్థిక సమైక్యత కోసం ఒక ప్రణాళిక అవసరమని ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ పట్ల ఆయన వైఖరి తరచూ వార్తల్లో నిలుస్తోంది.

నేపాల్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధితో భేటీ అయిన సందర్భంగా మహమ్మద్ యూనస్ జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం గురించి మాట్లాడారు. ఈ చర్చల్లో భాగంగా భారత ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తీసుకురావడం గమనార్హం. యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ భారత్‌తో సంప్రదాయ మైత్రికి భిన్నంగా నడుచుకుంటోందనే వాదనలకు ఈ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.

చైనాలో పర్యటించినప్పుడు కూడా

చైనాలో పర్యటించినప్పుడు కూడా ఆయన భారత ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే, గత నెలలో చైనా పర్యటన సందర్భంగా కూడా మహమ్మద్ యూనస్ భారత ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో చైనా తన కార్యకలాపాలను విస్తరించుకోవచ్చని ఆహ్వానించిన ఆయన "భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను 'సెవెన్ సిస్టర్స్' అంటారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. వారికి సముద్ర మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే ద్వారం. ఇది చైనాకు ఆర్థికంగా విస్తరించడానికి గొప్ప అవకాశం" అని వ్యాఖ్యానించినట్లుగా ఒక వీడియో విస్తృతంగా ప్రచారమైంది.

యూనస్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దీనిపై ఘాటుగా బదులిచ్చారు. "బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు, ఆందోళనలు ఉన్నాయి. బంగాళాఖాతంలో భారత్‌కు 6,500 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది. భారత్ ఐదు బిమ్స్‌టెక్ సభ్య దేశాలతో సరిహద్దు పంచుకోవడమే కాకుండా ఆసియాన్ దేశాలతో అనుసంధానాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్స్‌టెక్ కనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, విద్యుత్ గ్రిడ్‌లు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానమవుతోంది. ఇది నిజంగా గేమ్ ఛేంజర్" అని జైశంకర్ స్పష్టం చేశారు.


More Telugu News