కీలక ప్రకటన చేసిన సుప్రీంకోర్టు తాజా మాజీ సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా

  • ఇక మరే ప్రభుత్వ పదవినీ చేపట్టబోనని స్పష్టం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
  • పదవీ విరమణ తర్వాత పలువురు సీజేఐలు, న్యాయమూర్తులు ప్రభుత్వ పదవులు చేపట్టిన వైనం
  • ప్రాధాన్యతను సంతరించుకున్న సంజీవ్ ఖన్నా వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆయన కీలక ప్రకటన చేశారు. తాను ఇకపై ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టబోనని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు.

గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా, న్యాయమూర్తులుగా పనిచేసిన పలువురు పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇది విమర్శలకు తావిస్తోంది. ఈ తరుణంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా తాను పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ పదవీ చేపట్టబోనని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదే క్రమంలో న్యాయవాద వృత్తిలో పెరిగిపోతున్న అసత్య ధోరణిని ఆయన ప్రస్తావించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని సూచించారు. న్యాయ రంగానికి తన సేవలను కొనసాగిస్తానని ఖన్నా పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన రెండు ఇన్నింగ్స్‌లు ముగిశాయని, ఇక మూడో ఇన్నింగ్స్‌లో న్యాయరంగానికి సేవలు అందించే మరో పని చేపట్టబోతున్నట్లు తెలిపారు.

వీడ్కోలు కార్యక్రమంలో తదుపరి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ బీఆర్ గవాయ్, పలువురు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా పనితీరును, ఆయన హార్ధికమైన వ్యవహార శైలిని ప్రశంసించారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు.

2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ సంజీవ్ ఖన్నా గతేడాది నవంబర్ 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. 


More Telugu News