పాకిస్థాన్‌కు మళ్లీ వచ్చేది లేదు... బెంబేలెత్తిపోయిన పీఎస్ఎల్ విదేశీ క్రికెటర్లు

  • పీఎస్ఎల్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ కు చేరుకున్న విదేశీ క్రీడాకారులు
  • పాక్ లో తీవ్ర భయాందోళనకు గురయ్యామన్న క్రికెటర్ రషీద్ హుస్సేన్
  • ఆందోళనతో టామ్ కర్రస్ విపరీతంగా ఏడ్చేశాడన్న రషీద్
  • భారత్ – పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పీఎస్ఎల్‌ను రద్దు చేసిన పీసీబీ 
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన విదేశీ క్రీడాకారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తూ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయారు. భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పలువురు విదేశీ క్రీడాకారులు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్థాన్ నుంచి క్షేమంగా బయటపడితే చాలని ప్రార్థనలు చేశారని సమాచారం. ఈ విషయాన్ని పీఎస్ఎల్ క్రీడాకారుడు రషీద్ హుస్సేన్ వెల్లడించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025)కు పోటీగా అదే తరహాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని పలు నగరాలకు చెందిన జట్లు ఈ లీగ్‌లో తలపడుతుంటాయి. ఐపీఎల్ తరహాలోనే విదేశీ క్రీడాకారులు కూడా పాకిస్థాన్‌లో ఆడుతుంటారు. ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటే పీఎస్ఎల్ నిర్వహించాలని భావించారు.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు రషీద్ హుస్సేన్, దారెల్ మిచెల్, సామ్ బిల్లింగ్స్, కుశాల్ పెరీరా, డేవిడ్ వైస్, టామ్ కర్రస్ తదితరులు పాకిస్థాన్‌కు చేరుకున్నారు. అయితే, భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పీఎస్ఎల్‌ను రద్దు చేశారు. దీంతో చాలా మంది క్రికెటర్లు స్వస్థలాలకు వెళ్లిపోయారు.

ఈ క్రమంలో బంగ్లాదేశ్ వెళ్లేందుకు దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్న రషీద్ హుస్సేన్ అక్కడ మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్‌లో విదేశీ క్రికెటర్లు ఎదుర్కొన్న భయాందోళనల గురించి వివరించారు. పీఎస్ఎల్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లందరూ చాలా భయపడ్డారని ఆయన తెలిపారు.

జీవితంలో ఇంకెప్పుడూ పాకిస్థాన్ వెళ్లబోనని దారెల్ మిచెల్ తనతో అన్నట్లు రషీద్ వెల్లడించారు. టామ్ కర్రస్ అయితే ఇంటికి క్షేమంగా చేరుకుంటానో లేదోనని తీవ్రంగా భయపడటంతో పాటు విపరీతంగా ఏడ్చేశాడని, అతన్ని ఓదార్చడం చాలా కష్టమైందని ఆయన అన్నారు. తమ కుటుంబాలు చాలా ఆందోళన చెందాయని, దేవుడి దయ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని రషీద్ పేర్కొన్నారు. 


More Telugu News