బలూచిస్థాన్ నేత 'స్వాతంత్ర్య' ప్రకటన.. ఢిల్లీలో రాయబార కార్యాలయం కోసం భారత్‌కు విజ్జప్తి

  • బలూచిస్థాన్ స్వాతంత్ర్యం ప్రకటించిన మీర్ యార్ బలోచ్
  • భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం
  • న్యూఢిల్లీలో బలోచ్ రాయబార కార్యాలయానికి అనుమతి కోరిన బలోచ్
  • బలూచిస్థాన్‌కు ఐరాస శాంతి దళాలు పంపాలని విజ్ఞప్తి
  • తమ ప్రాంతం నుంచి పాక్ సైన్యం వెనక్కి వెళ్లాలని డిమాండ్
పాకిస్థాన్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత మీర్ యార్ బలోచ్, బలూచిస్థాన్ ప్రాంతం పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం పొందినట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మీర్ యార్ బలోచ్ తన ప్రకటనలో పలు కీలక డిమాండ్లను అంతర్జాతీయ సమాజం ముందుంచారు. న్యూఢిల్లీలో బలూచిస్థాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతించాలని ఆయన కోరారు. దీంతో పాటు, బలూచిస్థాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని, తమ ప్రాంతానికి శాంతి పరిరక్షక దళాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. బలూచిస్థాన్ భూభాగం నుంచి పాకిస్థాన్ సైన్యం తక్షణమే వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.

దశాబ్దాలుగా బలూచిస్థాన్ ప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నారని, పాకిస్థాన్ ప్రభుత్వం తమ సహజ వనరులను దోచుకుంటూ, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆయన గతంలో పలుమార్లు ఆరోపించారు.

తాజా ప్రకటనతో బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఊపు వచ్చినట్లయింది. భారత్-పాక్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, మీర్ యార్ బలోచ్ చేసిన ఈ ప్రకటనలు, ముఖ్యంగా భారత్ సహాయం కోరడం వంటి అంశాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.


More Telugu News