'జెడ్ ప్ల‌స్' కేటగిరీ భ‌ద్ర‌త‌ పునరుద్ధరించాలన్న జగన్... హైకోర్టులో విచారణ వాయిదా

  • జెడ్ ప్ల‌స్ కేటగిరీ భ‌ద్ర‌తపై ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన జ‌గ‌న్‌
  • తనకు ప్రాణహాని ఉందని పిటీష‌న్‌లో పేర్కొన్న‌ మాజీ సీఎం
  • ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు... త‌దుప‌రి విచార‌ణ‌ వేస‌వి త‌ర్వాతకు వాయిదా
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురైంది. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఆయన గురువారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్ర‌వారం విచారణ చేపట్టింది. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం... త‌దుప‌రి విచార‌ణ‌ను వేస‌వి త‌ర్వాతకు వాయిదా వేసింది. 

తనకు ఉన్న ప్రాణహాని దృష్ట్యా సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్ఎస్‌జీల‌తో సెక్యూరిటీ క‌ల్పించాల‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వాన్ని జగన్ అభ్య‌ర్థించారు. తన నివాసం, కార్యాలయం వద్ద పటిష్టమైన భద్రతతో పాటు, జామర్లు, పూర్తిస్థాయిలో పనిచేసే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలని కోరారు. అయితే, కేంద్రం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. తనకు తగిన భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టును విన్నవించారు. 

తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని కోరారు. ఈ సంద‌ర్భంగా, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, నోటీసు గానీ ఇవ్వకుండా తన భద్రతను భారీగా తగ్గించేశారని జ‌గ‌న్ ఆవేదన వ్యక్తం చేశారు. 




More Telugu News