భారత్‌-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తత.. ఐపీఎల్‌పై నీలినీడ‌లు!

  • పాకిస్థాన్‌తో అత్య‌వ‌స‌ర పరిస్థితుల న‌డుమ బీసీసీఐ ఈరోజు అత్య‌వ‌స‌ర స‌మావేశం
  • ఐపీఎల్‌ను రద్దు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం
  • ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశం కావ‌డంతో ఆ వైపుగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం 
దాయాది పాకిస్థాన్‌తో అత్య‌వ‌స‌ర పరిస్థితుల న‌డుమ బీసీసీఐ ఈరోజు అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఐపీఎల్‌ను రద్దు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశం కావ‌డంతో ఆ వైపుగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. 

గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌ను పొరుగు నగరాలైన జమ్మూ, పఠాన్‌కోట్‌లలో వైమానిక దాడుల హెచ్చరికల నేప‌థ్యంలో మధ్యలోనే రద్దు చేసిన విష‌యం తెలిసిందే. 

ఇప్పుడు భారత్‌, పాక్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌ కారణంగా మొత్తం లీగ్ రద్దు అయ్యే ప్రమాదం ఉంద‌ని స‌మాచారం. దీంతో ఇవాళ్టి స‌మావేశంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది ఉత్కంఠ‌త‌ను రేపుతోంది. 

నిన్న‌ రాత్రి మ్యాచ్ రద్దు కావడంతో లీగ్ ముందుకు సాగుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు. లీగ్‌లో పాల్గొంటున్న‌ విదేశీ ఆటగాళ్లు లేవనెత్తిన భద్రతా సమస్యల మధ్య ఇవాళ బీసీసీఐ సమావేశం కానుంద‌ని తెలిసింది.

కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన పక్షం రోజుల తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై, పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ లోని స్థావరాలపై భారత్‌ క్షిపణి దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. 

గురువారం జమ్మూలో వైమానిక దాడుల హెచ్చరికలు, పేలుడు వంటి శబ్దాల నివేదికల మధ్య పంజాబ్‌లోని పఠాన్‌కోట్, అమృత్‌సర్, జలంధర్, హోషియార్‌పూర్, మొహాలి, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌తో సహా అనేక జిల్లాల్లో బ్లాక్‌అవుట్ అమలు చేశారు.


More Telugu News