ఆపరేషన్ సిందూర్: ప్రతీకార జ్వాలల్లో పాకిస్థాన్.. యుద్ధం తప్పదన్న ప్రధాని షెహబాజ్

  • పాక్, పీవోకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు
  • మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ స్థావరాలు కూడా లక్ష్యం
  • ప్రతీకారం తీర్చుకుంటామని, యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తామని పాక్ ప్రధాని ప్రకటన
  • భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు తగ్గుతాయన్న పాక్ రక్షణ మంత్రి
ఇస్లామాబాద్: భారత సాయుధ బలగాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో జరిపన దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. 

బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించిన షెహబాజ్ షరీఫ్ "పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ యుద్ధాన్ని మేం చివరి వరకు తీసుకెళ్తాం. నా పాకిస్థానీ ప్రజలారా మీ భద్రత కోసం, మన సైన్యం, మన ప్రజలు - మనం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటాం. ఉగ్రవాదం వల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది" అని అన్నారు. కాగా, భారత దాడులకు ప్రతిస్పందనగా "తమకు నచ్చిన సమయంలో, ప్రదేశంలో, పద్ధతిలో" ప్రతీకారం తీర్చుకోవడానికి సాయుధ బలగాలకు అధికారం ఇచ్చినట్లు పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ అంతకుముందు ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌ భూభాగంలోని నాలుగు కీలక ప్రాంతాలతో పాటు పీవోకేలోని ఐదు ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగాయి. జైషే మహ్మద్ (జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ స్థావరంగా భావిస్తున్న బహవల్‌పూర్‌లోని అహ్మద్‌పూర్ షర్కియాలోని మసీదు సుభాన్‌అల్లా, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాన కార్యాలయంగా చెబుతున్న మురిడ్కేతో పాటు ముజఫరాబాద్, కోట్లి, బాఘ్‌లోని ఉగ్రవాద స్థావరాలు ఈ దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నాయి.

మరోవైపు, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దీనికి భిన్నంగా స్పందించారు. భారత్ తన ప్రస్తుత సైనిక వైఖరి నుంచి వెనక్కి తగ్గితే పరిస్థితి చక్కబడుతుందని వ్యాఖ్యానించారు. "భారత్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉంటే మేం కచ్చితంగా ఈ ఉద్రిక్తతను తగ్గిస్తాం" అని ఆసిఫ్ పేర్కొన్నారు. అయితే, ఇటీవలే స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు చాలా కాలంగా మద్దతు ఇస్తోందని ఆసిఫ్ అంగీకరించడం గమనార్హం. "గత మూడు దశాబ్దాలుగా అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు, యునైటెడ్ కింగ్‌డమ్ కోసం మేం ఈ చెడ్డ పని చేస్తున్నాం" అని ఆయన అంగీకరించారు.


More Telugu News