గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియంను పేల్చేస్తాం: పాకిస్థాన్ పేరిట ఈమెయిల్

  • గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కు అందిన ఈమెయిల్
  • ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో తీవ్రంగా పరిగణిస్తున్న అధికారులు
  • గుజరాత్ పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, అహ్మదాబాద్‌లోని ప్రఖ్యాత నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో భద్రతా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. రాబోయే రోజుల్లో ఇక్కడ కీలక ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక ఈమెయిల్ చిరునామాకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ బెదిరింపు సందేశం అందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'మేము మీ స్టేడియంను పేల్చివేస్తాం' అనే హెచ్చరికతో కూడిన ఈ మెయిల్‌ను ‘పాకిస్థాన్’ పేరుతో పంపినట్లు సమాచారం. ఈ బెదిరింపును అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా, ‘ఆపరేషన్ సిందూర్’ పరిణామాల తర్వాత ఈ తరహా హెచ్చరిక రావడంతో భద్రతా ఏజెన్సీలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

గుజరాత్ పోలీసులు, సైబర్ క్రైమ్ నిపుణుల బృందం ఈమెయిల్ మూలాలపై దర్యాప్తు ప్రారంభించాయి. బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి పంపారనే విషయాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాలతో పాటు, స్టేడియం లోపల కూడా భద్రతా ఏర్పాట్లను గణనీయంగా పెంచారు.


More Telugu News