కమిన్స్ జోరు... సన్ రైజర్స్ ముందు స్వల్ప లక్ష్యం

  • ఐపీఎల్ లో సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసిన ఢిల్లీ
  • కమిన్స్ కు 3 వికెట్లు
  • ఢిల్లీని ఆదుకున్న స్టబ్స్, అశుతోష్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్... ఢిల్లీ క్యాపిటల్స్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులకే కట్టడి చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లు క్రమశిక్షణతో బంతులు వేయడంతో ఢిల్లీ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఓ దశలో ఢిల్లీ 100 లోపే కుప్పకూలుతుందనిపించినా.. ట్రిస్టాన్ స్టబ్స్, అశుతోష్ వర్మ ఆదుకున్నారు.

తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన తొలి ఓవర్‌లోనే కరుణ్ నాయర్ (0) వికెట్ తీసి ఢిల్లీని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కొద్ది వ్యవధిలోనే ఫాఫ్ డు ప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8)లను కూడా కమిన్స్ పెవిలియన్ పంపడంతో ఢిల్లీ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ (6), కేఎల్ రాహుల్ (10) కూడా విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ 7.1 ఓవర్లలో 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్ (18) కొంత ప్రతిఘటించారు. ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించిన తర్వాత నిగమ్ రనౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా అశుతోష్ శర్మ దూకుడుగా ఆడి 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో అశుతోష్ ఔటయ్యాడు. మరోవైపు ట్రిస్టన్ స్టబ్స్ చివరి వరకు నిలబడి 36 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

సన్‌రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనద్కత్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. హర్షల్ పటేల్, ఎషన్ మలింగ తలో వికెట్ సాధించారు. సన్‌రైజర్స్ బౌలర్ల సమష్టి ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేయగలిగారు.


More Telugu News