పాడైపోయిన రీల్స్ నుంచి 3D గ్లోరీ వరకు... 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఎపిక్ రీస్టోరేషన్ జర్నీ

తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్లలో ఒకటి, మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయి చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మూవీ 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఐకానిక్ చిత్రం మే 9న 2D, 3D ఫార్మాట్లలో విడుదల కానుంది.

ఈ చిరస్మరణీయ సోషియో ఫాంటసీ డ్రామా చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించ‌గా, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తన ప్రతిష్ఠాత్మక బ్యానర్ వైజయంతి మూవీస్‌లో నిర్మించిన విష‌యం తెలిసిందే. 1990 మే 9న విడుద‌లైన ఈ మూవీకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బాణీలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. 

అయితే, ఈ మూవీ రీ రిలీజ్ ప్రింట్‌కు సంబంధించి తాజాగా వైజయంతి మూవీస్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్లాసిక్‌ను పునరుద్ధరించడం నిర్మాతలకు ఒక సవాలుతో కూడుకున్న ప్రయాణంగా మారిందట‌. ఎందుకంటే ఈ మూవీ ఒరిజిన‌ల్‌ నెగెటివ్ పూర్తిగా పాడ‌యిపోవ‌డమే అందుకు కార‌ణం. ఒక కాపీ దొరికినా కూడా అది తీవ్రంగా దెబ్బ‌తింది. అయితే, త‌మ‌ బృందం అవిశ్రాంత కృషి, అంకితభావంతో ప్రసాద్ కార్పొరేషన్‌తో కలిసి ఈ చిత్రం రీ రిలీజ్ ప్రింట్‌ను పునరుద్ధరించగలిగామ‌ని వారు తెలిపారు. అలాగే దానిని 3D ఫార్మాట్‌లోకి మార్చిన‌ట్లు పేర్కొన్నారు.

2018లో ఈ మూవీ మంచి రీల్స్‌ వెతకడం ప్రారంభించామని బృందం వెల్లడించింది. సరిగా భ‌ద్ర‌ప‌ర‌చ‌క‌పోవడం వల్ల రీల్స్ పూర్తిగా చెడిపోయిన‌ట్లు వారు తెలిపారు. మంచి రీల్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు సంవత్సరాల పాటు చిన్న‌చిన్న థియేట‌ర్ల‌కు వెళ్లి మ‌రీ విస్తృతంగా వెతికిన‌ట్లు చెప్పారు. ఈ క్ర‌మంలో 2021లో విజయవాడలో అప్పారావు అనే వ్యక్తి వద్ద వారికి ఉపయోగ‌ప‌డే రీల్స్ దొరికాయి. ఆ రీల్స్‌తోనే పున‌రుద్ధ‌ర‌ణ ప్రారంభించిన‌ట్లు వారు చెప్పారు. 

ఎంతో క‌ష్ట‌ప‌డి సాంకేతిక‌ బృందం అన్ని ప‌నులు పూర్తి చేసింది. చివరికి సినిమాను 8K రిజల్యూషన్‌లో డిజిటలైజ్ చేసిన‌ట్లు వారు తెలిపారు. ఆ తరువాత దానిని 4K అవుట్‌పుట్‌లోకి మార్చారు. అలాగే కొంత స‌మ‌యం తీసుకుని ఈ చిత్రాన్ని 3D ఫార్మాట్‌లోకి కూడా క‌న్వ‌ర్ట్ చేశారు. ఇలా ఏడేళ్ల నిర్విరామ‌ కృషి త‌ర్వాత ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీ 2D, 3D ఫార్మాట్లలో థియేటర్లలో సంద‌డి చేయ‌డానికి రెడీ అయింది. ఈ మేర‌కు వైజయంతి మూవీస్ బృందం ఒక వీడియో ద్వారా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఎపిక్ రీస్టోరేషన్ జర్నీని వివ‌రించారు.   


Chiranjeevi
Jagadeka Veerudu Atiloka Sundari
3D Restoration
Vijayanthi Movies
K Raghavendra Rao
Ilaiyaraaja
Telugu Cinema
Classic Film
Re-release
8K Restoration

More Telugu News