తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు

  • ఈరోజు ఉదయం 6 గంటలకు తెరుచుకున్న‌ ఆల‌య ద్వారాలు
  • ఈ సందర్భంగా హెలికాప్టర్‌ పైనుంచి భక్తులపై పుష్పవర్షం
  • బ‌ద్రినాథుడికి సీఎం పుష్కర్‌ ధామి ప్ర‌త్యేక పూజ‌లు
చార్‌ధామ్‌ యాత్రలో కీలకమైన బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈరోజు ఉదయం స‌రిగ్గా 6 గంటలకు ఆల‌య త‌లుపులను తెరిచారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌పై నుంచి భక్తులపై పుష్పవర్షం కురిపించారు. బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే గత ఆరు నెలలుగా వెలుగుతున్న అఖండ జ్యోతిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి దాదాపు పదివేల మందికిపైగా భక్తులు బద్రీనాథ్‌ ధామ్ చేరుకున్నారు.  

ఇక‌, ఈరోజు ఆలయ ద్వారాలను తెరిచిన సందర్భంగా.. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 40 క్వింటాళ్ల బంతిపువ్వులతో అందంగా తీర్చిదిద్దారు. ఛార్‌దామ్‌ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు  శుక్రవారం (మే 2న‌) ఉదయం 7 గంటలకు తెరుచుకున్న విష‌యం తెలిసిందే. అంతకుముందు అక్షయ తృతీయ రోజున (ఏప్రిల్ 30న‌) గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. 

బ‌ద్రినాథుడికి సీఎం పుష్కర్‌ ధామి ప్ర‌త్యేక పూజ‌లు
ఈ సందర్భంగా బద్రినాథ్‌ చేరుకున్న ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ ధామి ఆలయ తలుపులు తెరిచిన తర్వాత స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడారు. 

సీఎం ధామి మీడియాతో మాట్లాడుతూ ... "ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. ఇవాళ‌ బద్రినాథుడి ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ పవిత్ర భూమికి చేరుకున్న యాత్రికులందరినీ నేను స్వాగతిస్తున్నాను. యాత్రికులందరి ప్రయాణం సజావుగా పూర్తి కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో బద్రినాథుడి ఆల‌య అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

నిన్న జోషిమఠ్ నిర్మాణం, భద్రతా పనుల కోసం మేము ప్రధాని, హోంమంత్రిని అభ్యర్థించాం. వివిధ అభివృద్ధి పనులకు మాకు నిధులు ఇవ్వాలని కోరాం. మా అభ్య‌ర్థ‌న మేర‌కు రూ. 1700 కోట్లు ఇచ్చేందుకు ఆమోదించారు. అందులో మొదటి విడతగా రూ. 292 కోట్లు నిన్న విడుదలయ్యాయి. ఇందుకుగాను ప్రధాని,హోంమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని ముఖ్యమంత్రి ధామి అన్నారు.

ఇక‌, ఇటీవ‌ల జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గామ్‌లో జ‌రిగిన‌ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. చార్‌ధామ్‌ యాత్రకు పోలీసులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తు కల్పించాయి. అనుమానాస్ప‌దంగా ఎవ‌రైనా క‌నిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు అధికారులు సూచిస్తున్నారు. 


More Telugu News