నేను ఆ విషయంలో ఫెయిలయ్యా.. ఆర్సీబీతో ఓటమి అనంతరం ధోనీ కీలక వ్యాఖ్యలు

  • చెన్నైపై రెండు పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం
  • ఆయుష్ మాత్రే అద్భుత ఇన్నింగ్స్ వృథా
  • చివరి ఓవర్లో ధోనీ ఔట్.. మ్యాచ్ మలుపు
  • ఆఖరి ఓవర్లో చేతులెత్తేసిన చెన్నై
  • ఓటమికి తానే బాధ్యుడినని ధోనీ అంగీకారం
ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే)తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం చెన్నై సారథి ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ ఈ ఓటమికి తనదే బాధ్యత అని చెప్పుకొచ్చాడు. అత్యధిక లక్ష్య ఛేదనకు చేరువగా వచ్చి ఓడిపోయినట్టు తెలిపాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో చెన్నై ఆఖరి వరకు పోరాడింది. ముఖ్యంగా 17 ఏళ్ల యువ కెరటం ఆయుష్ మాత్రే అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 48 బంతుల్లోనే 94 పరుగులు చేసి, అసాధారణ పరిణతి కనబరిచాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్) కూడా రాణించినా, జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. మాత్రే వీరోచిత పోరాటం జట్టు ఓటమితో వృథా అయింది.

ఆఖరి ఓవర్లలో ఒత్తిడి పెరిగిన సమయంలో ధోనీ (8 బంతుల్లో 12) క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదడంతో ఆశలు చిగురించాయి. అయితే, యశ్ దయాళ్ వేసిన చివరి ఓవర్లో సమీకరణం ఉత్కంఠగా మారింది. ఆ ఓవర్లో ధోనీ ఆశించిన షాట్లు ఆడలేకపోయాడు. మూడు బంతుల్లో 13 పరుగులు అవసరమైన కీలక దశలో ధోనీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇదే మ్యాచ్‌లో నిర్ణయాత్మక మలుపుగా మారింది.

మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ ‘‘నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, అవసరమైన పరుగులు, వేస్తున్న బంతులను బట్టి చూస్తే.. ఒత్తిడి తగ్గించడానికి నేను మరికొన్ని షాట్లను బాది ఉండాల్సింది. ఈ ఓటమికి నాదే బాధ్యత’’ అని అంగీకరించాడు. ధోనీ ఔటైన తర్వాత కూడా మ్యాచ్‌లో నాటకీయత తగ్గలేదు. యశ్ దయాళ్ నడుము ఎత్తులో నో-బాల్ వేయడంతో సీఎస్‌కేకు ఊరట లభించింది. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే తొలి బంతికే సిక్సర్ బాదడంతో సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులకు చేరింది. విజయం చెన్నై వైపు మొగ్గుతున్నట్టు కనిపించినా, యశ్ దయాళ్ ఒత్తిడిని అధిగమించి చివరి బంతులను జాగ్రత్తగా వేసి ఆర్సీబీకి రెండు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు.

అంతకుముందు, ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఖలీల్ అహ్మద్, మతీశ పతిరణ బౌలింగ్‌ను అతను చీల్చి చెండాడాడు. విరాట్ కోహ్లీ (62), జాకబ్ బెథెల్ (55) కూడా అర్ధ శతకాలతో రాణించి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డారు.


More Telugu News