టెన్షన్లు తట్టుకోలేక మద్యం తాగుతున్నారా... మరి నిపుణులు చెప్పేది కూడా వినండి!

  • మద్యం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనంటున్న నిపుణులు
  • దీర్ఘకాలిక ఆందోళన పెంచుతుందని వెల్లడి
  • రక్తంలో తగ్గుతున్న ఆల్కహాల్ స్థాయిలతో మానసిక కుంగుబాటు
  • క్రమంగా వ్యసనంగా మారి, మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం
  • మెదడు పనితీరు, సెరోటోనిన్‌పై ప్రభావం.. క్యాన్సర్ ప్రమాదం ఉందంటున్న డబ్ల్యూహెచ్ఓ
తీవ్రమైన ఒత్తిడి లేదా ఏదైనా ముఖ్యమైన పని ముందు కాస్త మద్యం సేవిస్తే ఆందోళన తగ్గుతుందని, నరాలు తేలికపడతాయని చాలామంది భావిస్తుంటారు. కొందరు మందుబాబులను ఎందుకు మద్యం తాగారని ప్రశ్నిస్తే, టెన్షన్లు తట్టుకోలేక అనే సమాధానం వినిపిస్తుంటుంది. సినిమాల్లో కూడా ఇలాంటివి చూస్తుంటాం. అయితే, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనమేనని, దీర్ఘకాలంలో మద్యం ఆందోళనను తగ్గించడానికి బదులు మరింత పెంచుతుందని మానసిక ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

మద్యం కేంద్ర నాడీ వ్యవస్థపై మత్తుమందులా పనిచేస్తుంది. అందుకే తాగిన వెంటనే కొంత ప్రశాంతత లభించినట్లు అనిపిస్తుంది. కానీ, యశోదా హాస్పిటల్స్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎ. రాజేష్ దీనిపై స్పందిస్తూ, "రక్తంలో ఆల్కహాల్ స్థాయి (BAC) తగ్గడం ప్రారంభమైన వెంటనే, మానసిక కుంగుబాటు, ఆందోళన లక్షణాలు మళ్లీ తలెత్తుతాయి, కొన్నిసార్లు ముందుకన్నా తీవ్రంగా ఉంటాయి. మద్యం ప్రభావం తగ్గాక వచ్చే ఆందోళనను 'హ్యాంగైటీ' (Hangxiety) అని అంటారు" అని వివరించారు.

ఒత్తిడిని ఎదుర్కోవడానికి పదేపదే మద్యంపై ఆధారపడటం ప్రమాదకరం. ఇది క్రమంగా వ్యసనంగా (డిపెండెన్సీ) మారుతుంది. కాలక్రమేణా, అదే స్థాయి ఉపశమనం కోసం ఎక్కువ మద్యం అవసరమవుతుంది. ఇది మెదడులోని సెరోటోనిన్ వంటి రసాయనాల సమతుల్యతను దెబ్బతీసి, ఆందోళన సమస్యలను మరింత జఠిలం చేస్తుంది. సాధారణ ఆందోళన రుగ్మత (GAD), పానిక్ అటాక్స్ వంటి మానసిక సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం మద్యపానాన్ని విషపూరితమైనదిగా, వ్యసనానికి గురిచేసేదిగా, క్యాన్సర్ కారకంగా (Group 1 Carcinogen) వర్గీకరించింది. రొమ్ము, పేగు క్యాన్సర్లతో సహా ఏడు రకాల క్యాన్సర్లకు మద్యం కారణమని పేర్కొంది. "ఏ రూపంలో, ఎంత స్వల్ప పరిమాణంలో తీసుకున్నా మద్యం ఆరోగ్యానికి హానికరమే" అని ఇటీవలి పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని డాక్టర్ నాజియా దల్వాయ్ తెలిపారు.

ఆందోళన, ఒత్తిడిని ఎదుర్కోవడానికి మద్యానికి బదులు ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి. గాఢ శ్వాస వ్యాయామాలు, క్రమం తప్పని శారీరక శ్రమ, మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, మైండ్‌ఫుల్‌నెస్, యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని జయించడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) వంటి చికిత్సలు తీసుకోవడం మేలు. మద్యం తాత్కాలిక మాయే తప్ప, శాశ్వత పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


More Telugu News