ముంబ‌యి ఘ‌న విజ‌యం.. ప్లేఆఫ్స్ రేసు నుంచి రాజ‌స్థాన్ ఔట్‌!

  • నిన్న జైపూర్‌లో ఎంఐ, ఆర్ఆర్ మ్యాచ్
  • 100 ప‌రుగుల తేడాతో ముంబ‌యి ఘ‌న విజ‌యం 
  • 218 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ 117 ర‌న్స్‌కే ఆలౌట్
  • హాఫ్ సెంచ‌రీల‌తో రాణించిన రోహిత్ (53), రికెల్టన్‌ (61) 
  • ఆడిన 11 మ్యాచ్‌లకు గాను ఎనిమిదింటిలో ఓడిన ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమణ‌
గురువారం జైపూర్‌లోని స‌వాయి మాన్‌సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) చేతిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) ఘోరంగా ఓడింది. 218 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆ జ‌ట్టు 117 ర‌న్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో 100 ప‌రుగుల తేడాతో ముంబ‌యి ఘ‌న విజ‌యం సాధించింది. 

పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో మొదట బ్యాట్‌తో ఆ తర్వాత బంతితోనూ రాణించిన ముంబ‌యికి ఈ సీజన్‌లో ఇది వరుసగా ఆరో విజయం కావ‌డం విశేషం. ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పోరులో రాజస్థాన్‌ సమష్టిగా విఫలమైంది. ఆడిన 11 మ్యాచ్‌లకు గాను ఎనిమిదింటిలో ఓడిన ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబ‌యి ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 217 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (36 బంతుల్లో 53), రికెల్టన్‌ (38 బంతుల్లో 61) అర్ధ శ‌త‌కాల‌తో రాణించారు. ఈ ద్వ‌యం తొలి వికెట్‌కు శ‌త‌క (116) భాగ‌స్వామ్యం అందించ‌డం విశేషం. 

ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (23 బంతుల్లో 48 నాటౌట్‌), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్‌) రాణించారు. దీంతో ఎంఐ 20 ఓవ‌ర్లలో 217 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్ఆర్‌కు 218 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. 

అనంత‌రం ఛేదనలో రాజస్థాన్‌ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్య‌ ఛేద‌న‌ వైపు రాజ‌స్థాన్ కొన‌సాగ‌లేదు. గ‌త మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. అలాగే మంచి ఫామ్‌లో ఉన్న మ‌రో ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ కూడా 13 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. 

వ‌రుస విరామాల్లో వికెట్లు పారేసుకున్న రాజ‌స్థాన్ 76 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయింది. జ‌స్ప్రీత్‌ బుమ్రా తాను వేసిన తొలి ఓవర్లోనే పరాగ్‌ (16), హెట్‌మెయర్ (0)ను ఔట్‌ చేసి రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇక‌, ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన స్పిన్న‌ర్‌ కర్ణ్‌శర్మ... జురెల్ (11)తో పాటు తీక్షణ(2), కార్తీకేయ(2)ను పెవిలియ‌న్‌కు పంపి ఎంఐ గెలుపులో కీలకమయ్యాడు.

చివ‌రికి రాజస్థాన్‌ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టులో జోఫ్రా ఆర్చ‌ర్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ముంబ‌యి బౌలర్లలో కర్ణ్‌శర్మ(3/23), బౌల్ట్‌(3/28), బుమ్రా (2/15) రాయల్స్‌ ప‌త‌నాన్ని శాసించారు. ఈ సీజ‌న్‌లో ఎనిమిదో ఓటమితో రాజస్థాన్‌ అధికారికంగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ విజ‌యంతో ముంబ‌యి టాప్‌లోకి దూసుకెళ్లింది.


More Telugu News