భార‌త్‌లో అర్ష‌ద్ న‌దీమ్ ఖాతా కూడా బ్లాక్

  • పహల్గామ్ దాడి తర్వాత పాక్‌పై పలు చర్యలు తీసుకుంటున్న భారత్
  • ఇప్పటికే పాక్ సోష‌ల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ చానళ్లపై నిషేధం
  • తాజాగా స్టార్ అథ్లెట్‌ అర్ష‌ద్ న‌దీమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా భార‌త్‌లో బ్లాక్‌
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో దాయాది దేశానికి సంబంధించిన సోష‌ల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్స్ ను మ‌న ద‌గ్గ‌ర బ్లాక్ చేసిన భార‌త్‌... ఇప్పుడు పాక్‌కు చెందిన మ‌రో క్రీడాకారుడి ఖాతాపై చ‌ర్య‌ల‌కు ఉప్ర‌క్ర‌మించింది. ఆ దేశ స్టార్ అథ్లెట్‌, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడ‌ల్ విజేత అయిన అర్ష‌ద్ న‌దీమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను భార‌త్‌లో నిలిపివేసింది. 

ఇప్ప‌టికే పాక్‌కు చెందిన న‌టీన‌టులు, ప‌లువురు ప్ర‌ముఖుల‌ సోష‌ల్ మీడియా ఖాతాల‌ను బ్లాక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ జాబితాలో హనియా ఆమిర్, మహీరాఖాన్ అలీ జాఫర్, సనం సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్రా అజీజ్, ఇమ్రాన్ అబ్బాస్, సజల్ అలీ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలే కాదు, 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానళ్లను కూడా భారత్ నిషేధించింది. 

కాగా, ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత ఇరుదేశాల మ‌ధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. దాయాది దేశం ప‌ట్ల భార‌త్ క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తోంది. సింధూ జలాల నిలిపివేత‌, భార‌త గ‌గ‌న‌త‌లం మూసివేత‌, పాక్ పౌరుల‌ను దేశం నుంచి వెళ్ల‌గొట్ట‌డం, దౌత్య‌ప‌ర‌మైన ఆంక్ష‌లు వంటి చర్యలకు దిగింది. 


More Telugu News