విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్టు .. విమానంలో హైదరాబాద్ పంపిన పోలీసులు

  • విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన దీక్ష
  • విజయవాడలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం .. తీవ్ర ఉద్రిక్తత 
  • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
  • వైఎస్ షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్‌కు పంపిన వైనం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు (పీసీసీ) వైఎస్ షర్మిలను విజయవాడ పోలీసులు అరెస్టు చేసి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పంపించారు. మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో పర్యటిస్తానని ఆమె పేర్కొనడం, విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను గన్నవరం విమానాశ్రయం వద్దకు తీసుకువెళ్లి హైదరాబాద్ పంపించారు.

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం రాజధాని ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తొలుత గన్నవరంలో ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిని ఖండిస్తూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి నిరసన దీక్షకు దిగారు.

అంతలోనే ప్రధాని మోదీపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్తలు ఏపీసీసీ కార్యాలయంలోకి దూసుకువచ్చారు. పార్టీ కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి చేశారు. షర్మిల వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్టు చేసి గన్నవరం విమానాశ్రయం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్‌కు పంపించారు. 


More Telugu News