మంత్రి నాదెండ్ల చొరవతో తీరిన గిరిజనుల దాహార్తి

  • మంత్రి ఆదేశాలతో ఇంటింటికీ త్రాగునీరు సరఫరా చేస్తున్న అధికారులు
  • పులిరాముడిగూడెంలో త్రాగునీటి సమస్యకు  శాశ్వత పరిష్కారం
  • ఆర్ఓ ప్లాంట్‌కు మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ 
ఇటీవల ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజుల పాటు గిరిజన ప్రాంతాలలో పర్యటించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఇక‌, ఈనెల 23న బుట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెం పర్యటించగా అక్కడి ప్రజలు తమకు  త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, పరిష్కరించాలని మంత్రిని కోరారు. 

ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ వెంటనే ఆ ప్రాంత గిరిజనుల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని, అంతవరకూ ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలంటూ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని, ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారులను మంత్రి నాదెండ్ల ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 

ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారులు ముందుగా వెంటనే ఇంటింటికి రక్షిత త్రాగునీటిని ప్రతీరోజు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా గ్రామ పంచాయతీలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 2.50 లక్షలు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

అంతేకాక గిరిజన ప్రాంతాలతో పాటు జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 9.71కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కింద రూ. 5.01 కోట్లు, మండల ప్రజా పరిషత్తులకు రూ. 2.70 కోట్ల‌ నిధులు ఉన్నాయి. వాటి ద్వారా హ్యాండుపంపుల మరమ్మత్తులు, రక్షిత మంచినీటి పథకాల మరమ్మత్తులు కొనసాగుతున్నాయి.

పోలవరం నియోజకవర్గ గిరిజన ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీరు అందించేందుకు 15వ కమిషన్ గ్రాంట్ కింద రూ. 41.55 లక్షలు, అలాగే మండల ప్రజా పరిషత్ ఫైనాన్స్ నిధుల కింద రూ. 20 లక్షల నిధులు మంజూరయ్యాయి.

ఇక‌, ఇచ్చిన మాట ప్ర‌కారం త‌మ స‌మ‌స్య‌ను మంత్రి నాదెండ్ల ప‌రిష్క‌రించ‌డం ప‌ట్ల గిరిజ‌నులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలలో త్రాగునీటి సమస్యకు లక్షలాది రూపాయలు మంజూరు చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అసలు, సిసలైన ప్రజాప్రతినిధి అని కొనియాడుతున్నారు. మంత్రికి తమ గ్రామ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటామని, పులిరాముడుగూడెం ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.


More Telugu News