ఆస‌క్తిక‌రంగా ప్లేఆఫ్స్ స‌మీక‌ర‌ణాలు.. ఏ జ‌ట్టుకు ఎంతెంత అవ‌కాశం..!

  
మంగళవారం జ‌రిగిన‌ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్‌తో ప్లేఆఫ్స్ స‌మీక‌ర‌ణాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. డీసీపై కేకేఆర్ గెలిచి ప్లేఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఈ సీజన్‌లో అత్యంత నిలకడగా ఆడుతున్న జట్టుల్లో ఒకటైన ఢిల్లీ గత ఐదు మ్యాచుల్లో మూడింట‌ ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. కేకేఆర్‌పై డీసీ ఓటమి ఏకంగా ఏ నాలుగు జట్ల ప్లేఆఫ్స్ స‌మీక‌ర‌ణాల‌ను ఆస‌క్తిక‌రంగా మార్చేసింది. ప్ర‌స్తుతం 10 జ‌ట్ల‌కు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు ఎలా ఉన్నాయో ఒక‌సారి ప‌రిశీలిద్దాం... 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఇప్పటికే 14 పాయింట్లతో రజత్ పాటీదార్ నేతృత్వంలోని బెంగ‌ళూరు జ‌ట్టు ప్లేఆఫ్‌కు చాలా దగ్గరగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచులాడి ఏడింట గెలిచింది. మ‌రో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో రెండు గెలిస్తే టాప్‌-4లో నిలుస్తుంది. త‌ద్వారా ప్లేఆఫ్స్ బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకుంటుంది.  

ముంబ‌యి ఇండియన్స్ (MI): 10 మ్యాచుల్లో 6 విజయాలతో ముంబ‌యి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని జట్టు మొద‌ట వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మైంది. కానీ, ఆ త‌ర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా 5 మ్యాచ్‌లను గెలుచుకుంది. ఆడిన 10 మ్యాచుల్లో 6 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండు గెలిస్తే ఈజీగా ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. 

గుజరాత్ టైటాన్స్ (GT): 9 మ్యాచుల్లో 6 విజయాలతో, ఈ సీజన్‌లో మంచి ఫామ్‌తో పాటు స్థిరంగా ఉన్న జట్లలో గుజరాత్ ఒకటి. ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉండగా, టాప్ 4 స్థానాన్ని దక్కించుకోవడానికి కనీసం 2 మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది. అయితే, మూడు విజయాలు సాధిస్తే వారు ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో ప‌నిలేకుండా నేరుగా టాప్ 4కి దూసుకెళుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC): గత 6 మ్యాచుల్లో 4 ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం ఇబ్బందుల్లో ప‌డింది. అయితే, ఈ సీజన్‌లో అద్భుతమైన ఆరంభం సాధించిన అక్షర్ పటేల్ నేతృత్వంలోని జట్టు పాయింట్ల పట్టికలో ఇప్పటికీ 4వ స్థానంలో ఉంది. టాప్ 4 రేసులో నిల‌వాలంటే వారికి మిగిలిన 4 లీగ్ మ్యాచ్‌లలో కనీసం 2 విజయాలు అవసరం.

పంజాబ్ కింగ్స్ (PBKS): 9 మ్యాచుల్లో 5 విజయాలు సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ర‌ద్దు కావ‌డంతో ఒక పాయింట్ వ‌చ్చింది. దీంతో ప్ర‌స్తుతం 11 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. మిగిలిన 5 మ్యాచ్‌లలో పంజాబ్ కనీసం 3 విజయాలు సాధించాలి. అప్పుడు వారు నేరుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తారు. రెండు విజ‌యాలు సాధించిన అవ‌కాశాలు ఉంటాయి. కాక‌పోతే ఇత‌ర జ‌ట్ల‌ స‌మీక‌ర‌ణాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. 

లక్నో సూపర్ జెయింట్స్ (LSG): రిషభ్‌ పంత్ ను ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర (రూ.27కోట్లు)కు ద‌క్కించుకున్న లక్నోకు... అత‌డు ఆట‌గాడిగాను, కెప్టెన్‌గాను ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన న్యాయం చేయ‌లేదు. దాంతో ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచులాడిన ల‌క్నో 5 విజ‌యాలు మాత్ర‌మే న‌మోదు చేసింది. టాప్ 4లో చోటు ద‌క్కించుకోవాలంటే మిగిలిన 4 మ్యాచ్‌లలో కనీసం 3 గెలవాలి.

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): ఢిల్లీపై నిన్న రాత్రి సూప‌ర్ విక్ట‌రీతో కోల్‌క‌తా నైట్ రైడ్స్ ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవంగా ఉన్నాయి. ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున, అజింక్య రహానే సార‌థ్యంలోని కేకేఆర్‌ జట్టుకు కనీసం మూడు మ్యాచ్‌లు గెలవడం తప్పనిసరి. అప్పుడే ప్లేఆఫ్స్‌కు అవ‌కాశం ఉంటుంది. లేకుంటే ఇంటికే. 

రాజస్థాన్ రాయల్స్ (RR):  రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టు మిగిలిన త‌మ 4 మ్యాచుల్లో గెలిస్తే 14 పాయింట్లు సమకూరుతాయి. ఈ పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌కు వెళ్ల‌డం క‌ష్ట‌మే. కానీ, ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల ఆధారంగా వెళ్లే అవ‌కాశం ఉంటుంది.  

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): సీజన్ ప్రారంభం కావడానికి ముందే ఫేవరెట్‌లలో ఒకటి. కానీ, ఎస్ఆర్‌హెచ్‌ ప్రీ-సీజన్ హైప్‌ను అందుకోలేకపోయింది. స‌న్‌రైజ‌ర్స్ త‌న‌కు మిగిలి ఐదు మ్యాచుల్లోనూ త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాలి. ఒక్క‌దాంట్లో ఓడిన ఖేల్‌ఖ‌తం... దుకాణ్ బంద్‌. 

చెన్నై సూపర్ కింగ్స్ (CSK): ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో అట్ట‌ర్‌ప్లాప్ షోతో చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఇప్ప‌టివ‌రకు 9 మ్యాచుల్లో కేవలం 2 విజయాలతో ధోని జట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున ఉంది. సూపర్ కింగ్స్ మిగిలిన 5 ఆటల్లో గెలిచినా ప్లేఆఫ్స్‌కు చేర‌డం దాదాపు అసాధ్యం. సో... టెక్నిక‌ల్‌గా సీఎస్‌కే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన‌ట్లే. 


More Telugu News