వీవీఎస్ లక్ష్మణ్ నమ్మాడు... అదే సూర్యవంశి కెరీర్ లో టర్నింగ్ పాయింట్!

  • ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ రికార్డు
  • గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే శతకం.. భారత ఆటగాళ్లలో అత్యంత వేగవంతమైనది.
  • వైభవ్ ఎదుగుదలలో భారత క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ కీలక పాత్ర.
  • లక్ష్మణ్ గుర్తించి, ప్రోత్సహించి, ద్రవిడ్‌కు సిఫార్సు చేయడంతో వైభవ్‌కు అవకాశం
జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి, కేవలం 35 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారత ఆటగాడు సాధించిన అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే కావడం విశేషం. ఓవరాల్‌గా ఇది రెండో వేగవంతమైన శతకం. యశస్వి జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 166 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వైభవ్, 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించడంలో ప్రధాన భూమిక పోషించాడు.

వైభవ్ ప్రతిభను గుర్తించి, అతడిని వెలుగులోకి తీసుకురావడంలో ప్రస్తుత జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ పాత్ర మరువలేనిది. అండర్-19 క్రికెట్ సమయంలోనే లక్ష్మణ్ ఈ బాలుడి ప్రతిభను బలంగా నమ్మి ప్రోత్సహించాడు. ఇప్పుడా నమ్మకాన్ని అద్భుత శతకం ద్వారా సూర్యవంశి నిలుపుకున్నాడు.

గతంలో, బీహార్‌లో అంతర్ జిల్లా సీనియర్ టోర్నమెంట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా బీసీసీఐ అండర్-19 వన్డే ఛాలెంజర్ టోర్నమెంట్‌కు వైభవ్ ఎంపికయ్యాడు. అక్కడే అతడి ఆటతీరు లక్ష్మణ్‌ను ఆకట్టుకుంది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన అండర్-19 క్వాడ్రాంగులర్ సిరీస్‌కు లక్ష్మణ్ అతడిని ఎంపిక చేశాడు.

ఆ సిరీస్‌లో ఇండియా-బి తరఫున ఆడిన ఒక మ్యాచ్‌లో 36 పరుగుల వద్ద రనౌట్ కావడంతో వైభవ్ డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషయం గమనించిన లక్ష్మణ్, వైభవ్ వద్దకు వెళ్లి, "మేమిక్కడ కేవలం పరుగులు మాత్రమే చూడం. సుదీర్ఘకాలం రాణించగల నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను చూస్తాం" అని చెప్పి ధైర్యం నింపారని వైభవ్ కోచ్ మనోజ్ ఓఝా గతంలో వెల్లడించాడు. "లక్ష్మణ్ అతడి సామర్థ్యాన్ని చాలా త్వరగా గుర్తించాడు. బీసీసీఐ కూడా అతడికి అండగా నిలిచింది" అని ఓఝా తెలిపాడు.

లక్ష్మణ్ పాత్ర అక్కడితోనే ముగియలేదు. గత రెండేళ్లుగా ఎన్‌సీఏలో వైభవ్ ప్రగతిని వ్యక్తిగతంగా పర్యవేక్షించిన లక్ష్మణ్, అతడిని రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సిఫార్సు చేశాడు. ద్రవిడ్ కూడా వైభవ్‌ను ప్రోత్సహించాడు. ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వైభవ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సిక్సర్‌గా మలిచి తనలోని దూకుడును, తెగువను ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో 34 పరుగులు చేసి ఔటైనప్పుడు కూడా వైభవ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ఇప్పుడు విధ్వంసకర శతకంతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు.


More Telugu News