Heera: సహజీవనం చేసి, వాడుకుని వదిలేశాడు అంటూ... నటి హీరా చేసిన వ్యాఖ్యలు హీరో అజిత్ గురించేనా?

- జనవరిలో తన బ్లాగ్ లో ఒక హీరోపై తీవ్ర ఆరోపణలు చేసిన హీరా
- తనపై డ్రగ్ అడిక్ట్ అనే ముద్ర వేసి పక్కన పెట్టేశాడని ఆవేదన
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అజిత్ ఫ్యాన్స్
ఒకప్పటి ప్రముఖ కథానాయిక హీరా... తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ఉద్దేశించి రాసినట్లుగా భావిస్తున్న కొన్ని తీవ్ర ఆరోపణలు ప్రస్తుతం కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఆమె తన బ్లాగ్‌లో రాసిన ఓ సుదీర్ఘ పోస్ట్, ఇప్పుడు అనూహ్యంగా వైరల్ కావడమే ఈ చర్చకు కారణమైంది. ఈ పోస్ట్ వెలుగులోకి వచ్చిన సమయంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, హీరా ఈ ఏడాది జనవరిలో తన వ్యక్తిగత బ్లాగ్‌లో ఓ తమిళ నటుడితో తనకున్న గత సంబంధం గురించి, ఎదురైన అనుభవాల గురించి రాశారు. ఆ పోస్టులో ఆమె ఏ నటుడి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. అయితే, అందులోని అంశాలు అజిత్ ను సూచించేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ నటుడితో తాను సహజీవనం చేశానని, అతనికి వెన్నెముక సమస్య వచ్చినప్పుడు ఆసుపత్రిలో సేవలు చేశానని, కెరీర్‌లోనూ అండగా నిలిచానని హీరా పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత తనపై 'డ్రగ్ ఎడిక్ట్' అనే అబద్ధపు నింద వేసి, తనను దూరం పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
1996లో అజిత్, హీరా కలిసి నటించిన 'కాదల్ కొట్టై' (తెలుగులో 'ప్రేమలేఖ') చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది సహజీవనానికి దారితీసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారని కూడా కథనాలు వచ్చాయి. అజిత్ 1999లో 'అమర్కాలం' సినిమాలో తనతో నటించిన షాలినిని 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
హీరా తన బ్లాగ్ పోస్టులో, ఆ నటుడు తనతో విడిపోయిన తర్వాత తన సహనటిని వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ సమయంలో జరిగిన మధ్యవర్తిత్వంలో, "తాను ఒక పనిమనిషి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని, కాబట్టి భవిష్యత్తులో ఎవరితో శృంగారంలో పాల్గొన్నా ఆమె అభ్యంతరం చెప్పదని" ఆ నటుడు వ్యాఖ్యానించినట్లు హీరా ఆరోపించారు. పేరు ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు అజిత్, షాలినిలను కించపరిచేలా ఉన్నాయని అజిత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనవరిలో హీరా ఈ పోస్ట్ పెట్టినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, అజిత్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సమయంలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది వైరల్ కావడం వెనుక కుట్ర దాగి ఉందని అజిత్ అభిమానులు అనుమానిస్తున్నారు. తమ హీరో ప్రతిష్ఠను దెబ్బతీయడానికే, ఆయనపై గిట్టనివారే (ముఖ్యంగా ప్రత్యర్థి హీరో విజయ్ అభిమానుల ప్రమేయం ఉండొచ్చని) ఈ పోస్ట్‌ను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.