వైభ‌వ్ సూర్య‌వంశీ శ‌త‌కంపై అత‌ని తండ్రి ఏమ‌న్నాడంటే..!

  • కొడుకు ఐపీఎల్ సూప‌ర్ శ‌త‌కం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసిన‌ వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ 
  • ఈ సంద‌ర్భంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యం, కోచింగ్ సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు
  • గ‌త కొన్ని నెల‌లుగా అత‌నిని తీర్చిదిద్ద‌డంలో ఆర్ఆర్ పాత్ర కీల‌క‌మ‌ని వ్యాఖ్య‌
ఐపీఎల్‌లో వైభవ్‌ సూర్యవంశీ సూప‌ర్‌ శ‌త‌కం (35 బంతుల్లో 100)తో పాత రికార్డుల దుమ్ముదులిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల‌కే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ బీహార్‌ చిచ్చరపిడుగు... జైపూర్‌లో సృష్టించిన పరుగుల సునామీకి 2025 సీజన్‌లో వరుస ఓటముల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్ఆర్‌) గెలుపు బాట పట్టింది. ఇక‌, తన 14 ఏళ్ల కొడుకు చారిత్రాత్మక సెంచరీ సాధించిన తర్వాత వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగానికి గురయ్యారు. 

గత కొన్ని నెలలుగా త‌న‌ కుమారుడి నైపుణ్యాలు మెరుగుప‌రిచి, అత‌డు అద్భుతంగా రాణించ‌డానికి స‌హ‌క‌రించిన ఆర్ఆర్ ప్రధాన‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్‌, జుబిన్ భరుచా, సాయిరాజ్ బహుతులే, రూబీలతో సహా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, కోచింగ్ సిబ్బందికి ఆయన ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

"ఈరోజు ఐపీఎల్ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించి, తన జట్టును విజయపథంలో నడిపించాడు. అతని విజయం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాతో పాటు, మా మొత్తం ప్రాంతం, జిల్లా, బీహార్ రాష్ట్రం, యావ‌త్ దేశం అతని అద్భుతమైన బ్యాటింగ్‌ను చూసి ఆనంద ప‌డింది. వైభవ్ వృద్ధి, విజయానికి తోడ్పాటు అందించిన‌ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, ఆటగాళ్లందరికీ మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత మూడు, నాలుగు నెలలుగా ఆర్ఆర్‌ వైభవ్‌ను తమతోనే ఉంచుకుని అతనికి అద్భుతమైన శిక్ష‌ణ ఇచ్చింది. 

ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సర్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ సర్, జుబిన్ భరుచా సర్, సాయిరాజ్ బహుతులే సర్, రూబీ సర్ - వీరందరూ కలిసి అతని ఆటను మెరుగుపరచడానికి కలిసి పనిచేశారు. వైభవ్ కూడా చాలా కష్టపడ్డాడు. నేటి అత్యుత్తమ ప్రదర్శన ఆ ప్రయత్నం ఫలితమే. బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) అధ్యక్షుడు రాకేశ్‌ తివారీకి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయ‌న‌ చాలా చిన్న వయసులోనే వైభవ్‌ను బీహార్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చారు. వైభవ్ ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని తన ప్రతిభను ప్రదర్శించడం ద్వారా నేడు ఈ మైలురాయిని చేరుకున్నాడు" అని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తెలిపారు. 


More Telugu News