పహల్గామ్ ఉగ్రదాడిపై శశిథరూర్ వ్యాఖ్యలు.. ‘సూపర్ బీజేపీ మ్యాన్’గా అభివర్ణించిన సొంత పార్టీ నేత

  • ప్రభుత్వానికి అనుకూలంగా శశిథరూర్ వ్యాఖ్యలు
  • థరూర్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించిన ఉదిత్ రాజ్
  • బీజేపీ ఆయననేమైనా అధికార ప్రతినిధిగా నియమించిందా? అని ప్రశ్న
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీకే చెందిన మరో నేత ఉదిత్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పార్టీపై శశిథరూర్ విధేయత అబద్ధమని విమర్శించారు. శశిథరూర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? బీజేపీలోనా? అని ప్రశ్నించారు. ఆయన ‘సూపర్ బీజేపీ మ్యాన్’గా మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)పై బీజేపీ ప్రభుత్వ ప్రణాళికలను థరూర్ ప్రశ్నించాలని అన్నారు. ఆయనేమైనా బీజేపీ అడ్వకేట్‌గా మారబోతున్నారా? అని నిలదీశారు. ‘‘ 9/11 ఉగ్రదాడి తర్వాత అమెరికాలో ఏ ఉగ్రదాడి జరిగిందని ఆయనను అడగాలనుకుంటున్నాను. బీజేపీ ఆయననేమైనా అధికార ప్రతినిధిగా నియమించిందా?’’ అని ఉదిత్ రాజ్ విమర్శించారు. 

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత శశిథరూర్ ‘ఏఎన్ఐ’తో మాట్లాడతూ.. ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోవడం వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉండొచ్చని అన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నిఘా వ్యవస్థలు కూడా ఒక్కోసారి పసిగట్టలేకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఏ దేశం కూడా 100 శాతం నిఘా వ్యవస్థను కలిగి ఉండదని ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. ఉగ్రవాదులపై విజయవంతమైన ఆపరేషన్లను ఎవరూ గుర్తించరని, కానీ వైఫల్యాలు మాత్రం అందరికీ కనబడుతుంటాయని శశిథరూర్ పేర్కొన్నారు.  


More Telugu News