పిల్ల‌ల ఆరోగ్య ప‌రిస్థితి బాలేదు... ఆప‌రేష‌న్ చేయాలి... ఉండ‌నివ్వండి: ఓ పాకిస్థానీ వేడుకోలు

  • తన ఇద్దరు పిల్లల చికిత్స కోసం భార‌త్‌కు వచ్చిన పాకిస్థానీ
  • ప్ర‌స్తుతం ఢిల్లీలోని ఓ ఆసుప‌త్రిలో పిల్ల‌ల‌కు చికిత్స‌
  • వ‌చ్చే వారం పిల్ల‌లకు ఆప‌రేష‌న్
  • ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌నతో దేశం విడిచి వెళ్లాల‌నే ఆదేశాల‌తో స‌త‌మ‌తం
ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో పాకిస్థానీయుల‌ను రేప‌టిలోగా (ఏప్రిల్ 27) దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల‌ని భార‌త ప్ర‌భుత్వం ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఇక మెడిక‌ల్ వీసాల‌పై ఉన్న‌వారిని 29వ తేదీ వ‌ర‌కు అనుమ‌తి ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆదేశాలు ఓ పాకిస్థానీ ఫ్యామిలీకి ఆటంకంగా ప‌రిణ‌మించాయి. 

తన ఇద్దరు పిల్లల చికిత్స కోసం భార‌త్‌కు వచ్చిన ఆ కుటుంబం తమను స్వదేశానికి తిరిగి పంపే ముందు ఒక‌సారి ఆలోచించాల‌ని కోరుతోంది. ఆప‌రేష‌న్ కాకుండానే వెళ్లాలంటున్నార‌ని, పిల్ల‌ల‌ చికిత్స పూర్తి చేయడానికి అనుమతించాలని ఇరు దేశాల ప్రభుత్వాలను ఆ పిల్ల‌ల తండ్రి వేడుకున్నాడు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌, పాక్‌ మధ్య ఇటీవల సార్క్ వీసా హక్కులను రద్దు చేయడంతో ప్రభావితమైన వారిలో సింధ్‌లోని హైదరాబాద్‌కు చెందిన ఈ కుటుంబం కూడా ఉంది. జియో న్యూస్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆ పిల్లల తండ్రి... తన 9, 7 సంవత్సరాల పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నారని తెలిపాడు. 

"పుట్టుక నుంచి పిల్ల‌లు ఇద్ద‌రు గుండె స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు. భార‌త్‌లో అధునాతన వైద్య సేవ‌ల‌ కారణంగా వారికి ఢిల్లీలో చికిత్స సాధ్యమైంది. కానీ పహల్గామ్ ఘటన తర్వాత వెంటనే పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లమని మమ్మల్ని ఆదేశించ‌డం జ‌రిగింది. నా బిడ్డ‌ల‌కు వచ్చే వారం ఆప‌రేష‌న్‌ జరగాల్సి ఉంది. మా ప్రయాణం, బస, వారి చికిత్స కోసం ఇప్ప‌టివ‌ర‌కు మేము దాదాపు రూ.1 కోటి వ‌రకు ఖర్చు చేశాం. 

నా పిల్లల వైద్య చికిత్స పూర్తి చేయడానికి అనుమతించాలని నేను ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆసుపత్రి యాజ‌మాన్యం, వైద్యులు మా కుటుంబానికి సహకరిస్తున్నారు. ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌కుండా తిరిగి వెళితే, నా పిల్ల‌ల ప‌రిస్థితి ఏంటి?" అని ఆ పాకిస్థానీ వాపోయాడు. కాగా, పోలీసులు, విదేశాంగ కార్యాలయం వెంటనే ఢిల్లీ విడిచి వెళ్లాలని ఈ ఫ్యామిలీని ఆదేశించిన‌ట్లు పీటీఐ తన క‌థ‌నంలో పేర్కొంది.


More Telugu News