అమ్మాయిల వీడియోలు తీసి ఇతరులకు పంపిస్తున్నారు: వీబీఐటీ కాలేజీ విద్యార్థుల ఆందోళన, ఉద్రిక్తత

  • మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లోని వీబీఐటీ కాలేజీలో ఉద్రిక్తత
  • మహిళా హాస్టల్ వార్డెన్ రూప విద్యార్థినుల వీడియోలు తీశారని ఆరోపణలు
  • ఆ వీడియోలను మరో వార్డెన్‌కు పంపారని విద్యార్థుల ఆగ్రహం
  • వార్డెన్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్... ధర్నా
  • 15 మంది విద్యార్థులను హాస్టల్‌లో నిర్బంధించారంటూ యాజమాన్యంపై ఆరోపణ
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీబీఐటీ) ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాల మహిళా హాస్టల్ వార్డెన్ తమ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి ఇతరులకు పంపుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

వివరాల్లోకి వెళితే, కళాశాల హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న రూప అనే మహిళ, హాస్టల్‌లోని విద్యార్థినుల ప్రమేయం లేకుండా వీడియోలు తీస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. అంతేకాకుండా, ఆ వీడియోలను మరో వార్డెన్‌కు షేర్ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వార్డెన్ రూపను వెంటనే విధుల నుంచి తొలగించి, ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు.

సమస్యను పరిష్కరించాల్సింది పోయి, ఆందోళన చేస్తున్న వారిలో దాదాపు 15 మంది విద్యార్థులను యాజమాన్యం హాస్టల్‌లోనే బలవంతంగా నిర్బంధించిందని విద్యార్థులు ఆరోపించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తమకు న్యాయం చేయాలని, బాధ్యులైన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ఆరోపణలపై కళాశాల యాజమాన్యం నుంచి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది.


More Telugu News