ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి... ప్ర‌ధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్‌

  • మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విష‌యాన్ని తెలిపిన‌ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ
  • ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిని ఆయ‌న‌ తీవ్రంగా ఖండించినట్లు వెల్ల‌డి
  • ఉగ్ర‌వాద పోరులో యూఎస్‌, ఇండియా ఒక‌రికొక‌రు క‌లిసి పోరాడుతాయ‌న్న ట్రంప్‌
  • క‌శ్మీర్ ఉగ్ర ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసిందంటూ ట్రంప్ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌
  • ఫోన్ చేసి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డంతో ట్రంప్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ప్ర‌ధాని మోదీ 
క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడి విష‌య‌మై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించారు. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించిన‌ట్లు భార‌త విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విష‌యాన్ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్ ఎక్స్ (ట్విట్ట‌ర్) ద్వారా తెలియ‌జేశారు. 

"ప్ర‌ధాని మోదీకి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్ర‌దాడిలో చ‌నిపోయిన వారికి ఆయ‌న సంతాపం తెలిపారు. ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన వారిని చ‌ట్టం ముందుకు తీసుకురావ‌డానికి త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్ర‌వాద పోరులో యూఎస్‌, ఇండియా ఒక‌రికొక‌రు క‌లిసి పోరాడుతాయి. ఉగ్ర ఘ‌ట‌న‌ను ట్రంప్ తీవ్రంగా ఖండించారు" అని ర‌ణ‌ధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. 

అంత‌కుముందు ఇదే విష‌య‌మై డొనాల్డ్ ట్రంప్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. క‌శ్మీర్ ఉగ్ర ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని పేర్కొన్నారు. మృతిచెందిన వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌ధాని మోదీకి, భార‌త ప్ర‌జ‌ల‌కు త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని పేర్కొన్నారు.  

ఇక‌, ట్రంప్ ఫోన్ చేసి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డంతో ప్ర‌ధాని మోదీ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మ‌రోవైపు 2 రోజుల ప‌ర్య‌ట‌న కోసం సౌదీ అరేబియా వెళ్లిన మోదీ త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి హూటాహూటిన జెడ్డా నుంచి భార‌త్‌కు తిరుగుప‌య‌న‌మ‌య్యారు.    


More Telugu News