పెళ్లిలో విచిత్రమైన కానుక... నిర్ఘాంతపోయిన వరుడు!

  • వివాహ వేడుకలో నూతన దంపతులకు వినూత్న కానుక 
  • బ్లూ డ్రమ్‌‌ను బహుమతిగా వరుడి స్నేహితులు అందజేత
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్ 
  • వరుడి స్నేహితుల నిర్వాకంపై నెటిజన్ల మండిపాటు
సాధారణంగా వివాహ వేడుకల సమయంలో బంధువులు, మిత్రులు వధూవరులకు రకరకాల గిఫ్ట్‌లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే, తాము ఇచ్చే బహుమతి పది కాలాల పాటు గుర్తుండిపోయేలా ఉండాలని చాలామంది కోరుకుంటారు. కొందరు ఫన్నీ బహుమతులు అందజేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది.

కొత్తగా పెళ్లి అయిన జంటకు వరుడి స్నేహితులు ఓ బ్లూ డ్రమ్‌ను బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్నేహితులు బ్లూ డ్రమ్‌ను బహుమతిగా ఇవ్వడంతో వరుడు ఒక్కసారిగా షాక్‌కు గురికాగా, వధువు మాత్రం నవ్వు ఆపుకోలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మీరట్‌లో ఇటీవల జరిగిన ఒక దుర్ఘటనను గుర్తుచేసేలా ఈ బహుమతి ఉండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరట్‌లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి సిమెంటుతో నింపిన బ్లూ డ్రమ్ములో దాచింది. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఘటనను ప్రజలు మరచిపోకముందే వివాహ వేడుకలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో వరుడి స్నేహితులు ఆ ఘటనను గుర్తుచేసేలా బ్లూ డ్రమ్‌ను బహుమతిగా ఇవ్వడం విమర్శలకు దారితీసింది.

వివాహ వేడుక సమయంలో ఆ దారుణ ఘటనను గుర్తు చేయడం కంటే నీచమైన జోక్ మరొకటి ఉండదని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి స్నేహితులు ఉన్నవారికి శత్రువులు అవసరం లేదని ఒక నెటిజన్ దుయ్యబట్టగా, ఈ మూర్ఖులు వధువును రెచ్చగొట్టే విధంగా ఉన్నారని మరొకరు విమర్శించారు. 



More Telugu News