రాజేష్ రెడ్డి పేరుతో రాజ్ కసిరెడ్డి తప్పించుకునే ప్రయత్నం?

  • ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
  • గోవాలో అరెస్ట్ తప్పదని, మారు పేరుతో హైదరాబాద్ రాక!
  • నకిలీ ఐడీతో విదేశాలకు వెళ్లే ప్రయత్నం!
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి... రాజేష్ రెడ్డి అనే మారు పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు వెల్లడైంది. నకిలీ ఐడీతో పరారయ్యేందుకు ప్రణాళిక రచించాడు. 

గోవాలో అరెస్ట్ తప్పదని, మారు పేరుతో హైదరాబాద్ చేరుకున్నాడు. సిట్ విచారణ తప్పించుకునేందుకు నకిలీ ఐడీతో హైదరాబాద్ నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక వేసినట్టు సమాచారం. అయితే, పోలీసులు ఆ ప్లాన్ ను భగ్నం చేశారు.

తాను రేపు సిట్ విచారణకు హాజరవుతానని, అందుకే వచ్చానని రాజ్ కసిరెడ్డి చెప్పగా... మీరు సిట్ విచారణకు హాజరవుతారో లేదో మాకు అనుమానంగా ఉంది, అందుకే మేమే తీసుకెళుతున్నాం అంటూ ఆయనను ఏపీ పోలీసులు అక్కడి నుంచి తరలించినట్టు తెలిసింది.


More Telugu News