ఢిల్లీలో సుప్రసిద్ధ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం

  • అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబసమేత భారత పర్యటన
  • తొలి కార్యక్రమంగా ఢిల్లీ అక్షరధామ్ ఆలయ సందర్శన
  • ఆలయ కళ, వాస్తుశిల్పం, విలువలను మెచ్చుకున్న వాన్స్
  • భారతీయ వస్త్రధారణలో ఆకట్టుకున్న వాన్స్ పిల్లలు.
నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. తన అర్ధాంగి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి ఆయన తన పర్యటనను యమునా నదీ తీరంలోని విశాలమైన స్వామినారాయణ అక్షరధామ్ ఆలయ సందర్శనతో ఆరంభించారు.

వాన్స్ కుటుంబం ఆలయ ప్రాంగణంలో దాదాపు గంట సమయం గడిపింది. వారికి ఆలయ నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న వాన్స్ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఆలయ సందర్శన అనంతరం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సందర్శకుల పుస్తకంలో తన అనుభూతిని పంచుకున్నారు. "ఈ అద్భుత ప్రదేశానికి నన్ను, నా కుటుంబాన్ని ఆహ్వానించి, ఆదరించిన మీ దయ, ఆతిథ్యానికి ధన్యవాదాలు. ఇంతటి సుందరమైన ఆలయాన్ని ఎంతో నిబద్ధతతో, శ్రద్ధతో నిర్మించడం భారతదేశానికి గర్వకారణం. ముఖ్యంగా మా పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడ్డారు. దేవుడి ఆశీస్సులు మీకుండాలి" అని ఆయన పేర్కొన్నారు. 

ఆలయంలో ఏనుగుల శిల్పాలతో అలంకరించబడిన గజేంద్ర పీఠం వాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుందని, ఆలయ ప్రాంగణంలో తనకు ఎంతో ప్రశాంతత లభించిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ఆలయ వాలంటీర్ ఒకరు తెలిపారు.

ఈ సందర్భంగా వాన్స్ కుటుంబానికి చెక్కతో చేసిన ఏనుగు ప్రతిమ, ఢిల్లీ అక్షరధామ్ ఆలయ నమూనా, పిల్లల పుస్తకాలను బహూకరించినట్లు ఆలయ పూజారి ఒకరు వెల్లడించారు. వాన్స్ కుటుంబం ఆలయంలోని అద్భుతమైన కళ, వాస్తుశిల్పాన్ని పరిశీలించిందని, భారతదేశ వారసత్వం, సాంస్కృతిక లోతును అనుభూతి చెందారని, అలాగే సామరస్యం, కుటుంబ విలువలు, శాశ్వత జ్ఞానం వంటి సందేశాలను అభినందించారని ఆలయ నిర్వాహకులు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలిపారు.

అంతకుముందు, సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వాన్స్ కుటుంబానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సాదర స్వాగతం పలికారు. ఈ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా వారు జైపూర్, ఆగ్రాలను కూడా సందర్శించనున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, వాన్స్ కుటుంబంతో ద్వైపాక్షిక చర్చల అనంతరం వారికి ప్రైవేట్ విందు ఏర్పాటు చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.


More Telugu News