ఏదీ కాగితం?... అభిషేక్ శర్మ జేబులో సరదాగా వెదికిన సూర్యకుమార్ యాదవ్!

 
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అతని వద్దకు వచ్చి సరదాగా జేబును తనిఖీ చేయడం కెమెరాలకు చిక్కింది. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

గతంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుత శతకం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ (మొత్తం 55 బంతుల్లో 141 పరుగులు), ఆ సందర్భంగా తన జేబులోంచి ఒక చిన్న కాగితం తీసి ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ కాగితంపై "థిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ" అని రాసి ఉంది. తన శతకాన్ని అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు అతను సూచించాడు. ఈ 'నోట్ సెలబ్రేషన్' అప్పట్లో బాగా వైరల్ అయింది.

ఈ నేపథ్యాన్ని గుర్తుచేసుకుంటూ, ముంబైతో మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటింగ్ చేస్తుండగా సూర్యకుమార్ యాదవ్ వెనుక నుంచి వచ్చి అభిషేక్ ప్యాంట్ జేబును సరదాగా తడిమాడు. బహుశా మరో 'నోట్' ఏమైనా ఉందేమోనని చూస్తున్నట్లుగా సూర్య చేసిన ఈ పని మైదానంలో కాసేపు నవ్వులు పూయించింది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య కనిపించిన ఈ స్నేహపూర్వక వాతావరణం అభిమానులను ఆకట్టుకుంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 40 పరుగులు చేసి, హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో సన్‌రైజర్స్ తరఫున అభిషేక్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం, ముంబయి జట్టు 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి విజయభేరి మోగించింది.


More Telugu News