సూపర్ ఓవర్‌లో గెలిచిన ఢిల్లీ

  • నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌లో సూపర్ ఓవర్
  • అప్పుడు కూడా విజేత ఢిల్లీనే
  • మళ్లీ అగ్రస్థానంలోకి ఢిల్లీ కేపిటల్స్
ఢిల్లీ జట్టు మళ్లీ ఫామ్‌లోకి  వచ్చేసింది. వరుసగా నాలుగు విజయాల తర్వాత తొలి ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన ఆ జట్టు మళ్లీ పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన ఢిల్లీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఆ జట్టు నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.

యశస్వి జైస్వాల్ (51), నితీశ్ రాణా (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ సంజు శాంసన్ 31 పరుగులు చేయగా, ధ్రువ్ జురెల్ 26, షిమ్రన్ హిట్మెయిర్ 15 పరుగులు చేశారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి సరిగ్గా 188 పరుగులే చేయగలిగింది. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. స్టార్క్ వేసిన సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ 11 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగు బంతుల్లోనే ఛేదించి విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌లో 2021లో చివరిసారి ఓ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు సూపర్ ఓవర్ జరిగింది. అప్పుడు కూడా ఢిల్లీనే విజయం సాధించడం గమనార్హం.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ 49, రాహుల్ 38, స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్ చెరో 34 పరుగులు చేశారు. పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయడంతోపాటు సూపర్ ఓవర్‌లో అద్భుత స్పెల్ వేసిన మిచెల్ స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.


More Telugu News