ఆ ఇద్దరి హీరోల విషయంలో అలా జరిగిందట! 

  • వశిష్ఠ గురించి ప్రస్తావించిన తండ్రి 
  • డైరెక్షన్ ఛాన్స్ కోసం పడిన కష్టాల గురించి ప్రస్తావన     
  • హిట్ తో హీరోల నిర్ణయాలు మారిపోతాయని వ్యాఖ్య 
  • అలా రెండు ప్రాజెక్టులు చేజారిపోయాయని వెల్లడి 

నిర్మాతగా మల్లిడి సత్యనారాయణకు మంచి పేరు ఉంది. ఆయన నుంచి కొన్ని హిట్ సినిమాలు వచ్చాయి. 'బింబిసార'  దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఈయన కుమారుడే. తాజాగా ఆయన 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "చాలాకాలం క్రితమే మా బాబు వేణు (వశిష్ఠ) దర్శకుడిగా ప్రయత్నాలు ప్రారంభించాడు. రవితేజకి కథ నచ్చింది గానీ, ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తికావడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అప్పుడు సుధాకర్ రెడ్డి గారు, నితిన్ డేట్స్ ఇస్తానని ముందుకొచ్చాడు" అని అన్నారు. 

" మా కథ నచ్చలేదని, నితిన్ కోసం వాళ్లే ఒక కథను సెట్ చేసుకున్నారు. నిర్మాత మాత్రం మా స్నేహతుడే. అడ్వాన్స్ గా నితిన్ కి 75 లక్షలు ఇప్పించాము. అలా రెండు కోట్లు ఖర్చుపెట్టి ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి  తీసుకుని వెళ్లడానికి అంతా రెడీ చేశాము. ఆ సమయంలో వచ్చిన 'అ ఆ' పెద్ద హిట్ అయింది. 'అ ఆ' తరువాత కొత్త డైరెక్టర్స్ తో చేస్తే మా వాడి రేంజ్ పడిపోతుంది .. ఇప్పుడైతే చేయలేం .. తరువాత చూద్దాం' అని సుధాకర్ రెడ్డి అన్నారు" అని చెప్పారు.  

"మా అబ్బాయి .. అల్లు శిరీష్ మంచి ఫ్రెండ్స్. అందువలన మా అబ్బాయి దర్శకత్వంలో హీరోగా చేస్తానని అల్లు శిరీష్ అన్నాడు. మా వాడు కథ రెడీ చేసుకున్నాడు .. కలలు కనేశాడు. సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఈ లోగా 'శ్రీరస్తు శుభమస్తు' విడుదలై హిట్ కొట్టింది. దాంతో శిరీష్ మైండ్ లో మార్పు వచ్చింది. కొత్త దర్శకుడితో చేయడం మంచిది కాదని భావించి, వేరే ప్రాజెక్టు వైపు వెళ్లిపోయాడు. అప్పుడు అరవింద్ గారు కూడా చాలా ఫీలయ్యారు" అని అన్నారు.




More Telugu News