వృద్ధురాలిని చంపి.. మృతదేహంపై డ్యాన్స్.. బాలుడి పైశాచిక ఆనందం

  • హైదరాబాద్‌లోని కుషాయిగూడలో దారుణం
  • వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు
  • మృతదేహంపై నాట్యం చేస్తూ వీడియో చిత్రీకరణ
  • బెంగళూరులో ఉన్న స్నేహితులకు వీడియో పంపిన నిందితుడు
  • అక్కడికి పోలీసులకు అది చేరడంతో విషయం వెలుగులోకి
హైదరాబాద్‌లోని కుషాయిగూడలో దారుణం జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా చంపిన 17 ఏళ్ల బాలుడు ఆమె మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఆపై దానిని తన స్నేహితులకు పంపాడు. నిందితుడు ప్రస్తుతం కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. స్థానిక కృష్ణానగర్ కాలనీలో హత్యకు గురైన వృద్ధురాలు కమలమ్మ కేసులో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయమిది. పోలీసుల కథనం ప్రకారం.. కమలమ్మ ఓ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఉన్న రెండు షటర్లను రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్ చౌదరి, లలిత్ చౌదరికి అద్దెకిచ్చింది. రాజస్థాన్‌కే చెందిన 17 ఏళ్ల బాలుడు వారి వద్ద 8 నెలలుగా పనిచేస్తున్నాడు. అయితే, దుకాణం నిర్వహణ విషయంలో బాలుడిని తరచూ కమలమ్మ మందలిస్తోంది. కనిపించినప్పుడల్లా కసురుకుంటోంది. 

తనను ఎప్పుడూ కోపగించుకుంటుండటంతో కమలమ్మపై బాలుడు కక్ష పెంచుకున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె మెడకు చీరను బిగించి హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని ఎక్కి తొక్కాడు. అప్పటికీ అతడి కోపం చల్లారకపోవడంతో మెడను తొక్కుతూ డ్యాన్స్ చేశాడు. దీనిని వీడియో తీసి బెంగళూరులోని తన స్నేహితులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు. అక్కడా వీడియో వైరల్‌గా మారడంతో అక్కడి పోలీసులు ఆరా తీశారు. 

ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగినట్టు గుర్తించి రాచకొండ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హత్యకేసు వెలుగులోకి వచ్చింది. కుళ్లిన స్థితిలో ఉన్న కమలమ్మ మృతదేహాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు తీసిన వీడియో బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఒంటరి కావడంతో ఆస్తి కోసం ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News