జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. నిరుద్యోగులు పోటెత్తడంతో స్వల్ప తోపులాట

  • పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతీయువకులు
  • హాలు లోపలకు వెళ్లే క్రమంలో తోపులాట
  • జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొంటున్నాయన్న మంత్రులు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాలులో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ ఉద్యోగ మేళాను ప్రారంభించారు. 

యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యోగార్థులు హాలు లోపలకి వెళ్లే క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఉద్యోగ మేళాలో 60 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కంపెనీల ద్వారా 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం వస్తుందని, ప్రభుత్వ ఉద్యోగం అందరికీ రావడం కష్టమని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.

సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి సీతక్క భోజనం

మహబూబాబాద్ కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. గుంజేడులోని శ్రీ ముసలమ్మ దేవాలయాన్ని సందర్శించి, దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గుంజేడు గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి ఆమె భోజనం చేశారు.


More Telugu News