జ‌ట్టుకు భారంగా మారాడంటూ విమ‌ర్శ‌లు... ధోనీపై రాబిన్ ఉతప్ప ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

  • ఈ ఐపీఎల్‌ సీజ‌న్‌లో ఆశించిన స్థాయిలో ఆడ‌లేక‌పోతున్న సీఎస్‌కే
  • ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట ఓట‌మి
  • ధోనీ జ‌ట్టుకు భారంగా మారాడ‌నే వ్యాఖ్య‌లు
  • చెన్నై టీమ్‌కు ధోనీ ఎప్ప‌టికీ స‌మ‌స్య కాద‌న్న రాబిన్ ఉత‌ప్ప‌
  • ప్ర‌స్తుతం జ‌ట్టు మార్పు ద‌శ‌లో ఉంద‌న్న మాజీ ప్లేయ‌ర్
ఈ ఐపీఎల్‌ సీజ‌న్‌లో ఆశించిన స్థాయిలో ఆడ‌లేక‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా నాలుగు ఓట‌ములతో ఆ జ‌ట్టు ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానానికి ప‌డిపోయింది. ఆడిన ఐదు మ్యాచ్ లలో ఒక్క విజ‌యం మాత్ర‌మే న‌మోదు చేసింది. నిన్న‌టి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)పై చివ‌రి వ‌ర‌కు పోరాడినా విజ‌యాన్ని మాత్రం అందుకోలేక పోయింది. 18 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. 

ఇక మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గ‌త నాలుగు మ్యాచుల్లో లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాటింగ్‌కు రాగా... నిన్న మాత్రం ప్ర‌మోష‌న్ పొంది ఐదో స్థానంలో క్రీజులోకి వ‌చ్చాడు. 12 బంతుల్లోనే 27 ర‌న్స్ బాదాడు. కాగా, ఈ మ్యాచ్ ముందు వ‌ర‌కు ధోనీ జ‌ట్టుకు భారంగా మారాడ‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో సీఎస్‌కే మాజీ ప్లేయ‌ర్ రాబిన్ ఉతప్ప‌... ఎంఎస్‌డీ విష‌య‌మై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. చెన్నై టీమ్‌కు ధోనీ విషయం ఎప్ప‌టికీ స‌మ‌స్య కాద‌ని, ప్ర‌స్తుతం జ‌ట్టు మార్పు ద‌శ‌లో ఉంద‌ని పేర్కొన్నాడు. 

రాబిన్ ఉత‌ప్ప మాట్లాడుతూ... "ధోనీ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌పై ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేదు. చెన్నై జ‌ట్టుకు ఒక భారంగా ధోనీ ఎప్ప‌టికీ మార‌డు. అత‌ని ఆట‌తీరులో దూకుడు లేద‌నే వ్యాఖ్య‌లు సరికాదు. రాబోయే కాలంలో సీఎస్‌కే నుంచి ఏం ఆశిస్తున్నార‌నేది ఎంఎస్‌డీకి బాగా తెలుసు. ఇప్పుడు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు మార్పుల ద‌శ‌లో ఉంది. త‌ప్ప‌కుండా అన్ని స‌మ‌స్య‌ల‌కు ముగింపు ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్నా" అని మాజీ ఆట‌గాడు అన్నాడు. 


More Telugu News