చంద్రబాబు పర్యటనలో భద్రతాలోపం.. చంద్రబాబు కాళ్లకు నమస్కరించిన వైసీపీ నేత!

  • శనివారం ముప్పాళ్లలో చంద్రబాబు పర్యటన
  • హెలిప్యాడ్ వద్దకు ఎవరు పడితే వారొచ్చి సీఎంతో ఫొటోలు
  • హెలిప్యాడ్, ఇతర ప్రాంతాల్లో సంచరించిన వైసీపీ నేత
  • సీఎంను కలిసి ఫొటోలు దిగిన వారిపై ఆరా
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ముప్పాళ్ల పర్యటనలో భద్రతా లోపాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పిస్తున్న నేతల్లో చంద్రబాబు ఒకరు. కాబట్టి ప్రతి ఒక్కరి కదలికలపైనా నిఘా పెడతారు. అయితే, శనివారం నాటి ముప్పాళ్ల పర్యటనలో సీఎం వద్దకు ఎవరు పడితే వారు రావడంతో వారు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఎవరు పడితే వారు వచ్చి చంద్రబాబును కలిసి ఫొటోలు దిగారు. కంచికచర్ల మండలంలోని ఒక గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు హెలిప్యాడ్ వద్దకు వచ్చి చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి కాళ్లపై పడి నమస్కారం చేశాడు. అలాగే, వైసీపీ ముఖ్య నాయకుడి వద్ద పనిచేసే వ్యక్తి హెలిప్యాడ్‌తోపాటు, ఇతర ప్రాంతాల్లో సంచరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం, పరిచయ కార్యక్రమానికి కొందరి నాయకుల పేర్లు నిర్ణయించారు. వారిని మాత్రమే అనుమతించాల్సి ఉండగా, మరికొందరు రావడంపై వివరాలు సేకరిస్తున్నారు. పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇలా ఎవరు పడితే వారు సీఎం దగ్గరికి వెళ్లగలిగారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


More Telugu News