బీజేపీ నేతలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

  • నేడు బీజేపీ 46వ వ్యవస్థాపక దినోత్సవం
  • బీజేపీ ఘనతలను ప్రస్తావించిన పవన్ కల్యాణ్
  • దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వాసాన్ని పొందిన పార్టీగా అభివృద్ధి చెందిందని కితాబు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 46వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బీజేపీ నేతలకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి దూరదృష్టి గల నాయకుల నేతృత్వంలో బీజేపీ ప్రయాణం ప్రారంభమైందని వెల్లడించారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పార్టీ ఏర్పడిందని తెలిపారు. జాతీయ సేవ ప్రాతిపదికన రూపుదిద్దుకున్న ఒక ఆదర్శం, దేశవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వాసాన్ని పొందిన పార్టీగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. 

"నేడు జేపీ నడ్డా నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా వ్యూహాత్మక ముందు చూపుతో, బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది... కేంద్రంలో వరుసగా మూడు పర్యాయాలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ శుభ సందర్భంలో, బీజేపీ జాతీయ నాయకత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, దేశ నిర్మాణానికి అంకితమైన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ  పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News