పరస్పర సుంకాన్ని ప్రకటించిన ట్రంప్‌.. భార‌త్‌పై ఎంతో తెలుసా..?

  • పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకట‌న‌
  • పెంచిన సుంకాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డి
  • భారత్‌పై 26 శాతం.. చైనాపై 34 శాతం సుంకం విధించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌పంచంలోని అనేక దేశాల‌పై ప‌ర‌స్ప‌ర సుంకాలు విధించారు. పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేగాక పెంచిన సుంకాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపారు. అధికార భ‌వ‌నం వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.

ఈ రోజును 'లిబరేషన్ డే'గా నిర్వచించిన ట్రంప్, ఈ ప్రత్యేక సమావేశానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ రంగ కార్మికులను ఆహ్వానించారు. ఇక భార‌త్‌తో పాటు చైనాపై భారీగానే పరస్పర సుంకాలను విధించారు. అయితే, ఆయా దేశాలు త‌మ నుంచి వసూలు చేస్తున్న సుంకాల్లో తాము స‌గ‌మే విధిస్తున్న‌ట్లు, త‌ద్వారా తాము వారిపై దయతో ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా ట్రంప్ తెలిపారు. వీటిని 'రాయితీ పరస్పర సుంకాలు' అని పేర్కొన్నారు. ఇక‌ భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం దిగుమతి సుంకాన్ని అమెరికా వసూలు చేస్తుందని ట్రంప్ ప్ర‌క‌టించారు.

భారతదేశం గురించి మాట్లాడుతూ... న్యూఢిల్లీ విధించిన సుంకాలను చాలా కఠినమైనవి అని ఆయన అభివర్ణించారు. "వారి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే యూఎస్ వ‌చ్చి వెళ్లారు. ఆయన నాకు మంచి మిత్రుడు. కానీ నేను ఆయ‌న‌తో 'నువ్వు నా స్నేహితుడు, కానీ నువ్వు మాతో సరిగ్గా వ్యవహరించడం లేదు' అని చెప్పాను. ఇండియా మా నుంచి 52 శాతం సుంకం వసూలు చేస్తుంది. కాబట్టి మేము దానిలో సగం 26 శాతం వసూలు చేస్తాం" అని  ట్రంప్ అన్నారు.

అలాగే అమెరికాకు ప్రధాన వాణిజ్య భాగస్వాములు, మిత్రదేశాలు అయిన యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతులపై 20 శాతం, యూకేపై 10 శాతం సుంకాన్ని అధ్యక్షుడు ప్రకటించారు. జపాన్‌పై కూడా ఆయన 24 శాతం సుంకాన్ని విధించారు. అయితే, పరిశ్రమల వారీగా ఈ సుంకాలను ఎలా విధిస్తారో అధ్యక్షుడు ట్రంప్ వివరించలేదు.

"ఇలా చేయడం ద్వారా మనం మన ఉద్యోగాలను తిరిగి పొందుతాం. మన పరిశ్రమను తిరిగి పొందుతాం. మన చిన్న, మధ్య తరహా వ్యాపారాలను తిరిగి పొంద‌డం జ‌రుగుతుంది. త‌ద్వారా అమెరిక‌న్ల‌ను మళ్లీ సంపన్నులను చేస్తాం. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు గర్జిస్తూ వస్తాయి" అని అధ్య‌క్షుడు ట్రంప్‌ అన్నారు.


More Telugu News