తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

  • ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడి
  • ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురుస్తుందన్న వాతావరణ కేంద్రం
  • గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కావొచ్చని తెలిపిన అధికారి
తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భూఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

రేపటి నుంచి రెండు రోజుల పాటు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు, గద్వాల, నారాయణపేట, పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వనపర్తి మొదలైన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


More Telugu News