కోహ్లీ నెక్ట్స్ టార్గెట్ ఇదే.. ఆ సందేహాల‌కు చెక్‌!

  • తాజాగా ఓ ఈవెంట్‌లో త‌న ఫ్యూచ‌ర్ ప్లాన్‌పై మాట్లాడిన కోహ్లీ
  • త‌న కెరీర్‌లో త‌ర్వాతి అతిపెద్ద ల‌క్ష్యం 2027 వ‌న్డే ప్రపంచ కప్ గెల‌వ‌డ‌మేన‌ని వెల్ల‌డి
  • రిటైర్మెంట్ ఊహాగానాల‌కు తెర‌.. వ‌చ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొనడాన్ని ధృవీకరించిన వైనం
టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లీ త‌న ఫ్యూచ‌ర్ ప్లాన్‌పై తాజాగా ఓ ఈవెంట్‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. 2027 ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్ గెల‌వ‌డానికి ప్ర‌య‌త్నించ‌డమే త‌న కెరీర్‌లో త‌ర్వాతి అతిపెద్ద ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నాడు. త‌ద్వారా ర‌న్ మెషీన్ రిటైర్మెంట్ ఊహాగానాల‌కు తెర‌దించుతూ, వ‌చ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొనడాన్ని ధృవీకరించాడు. ఇక ఈ మెగా టోర్నీ ఆతిథ్య దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి అనే విష‌యం తెలిసిందే. 

36 ఏళ్ల విరాట్ కోహ్లీ వ‌య‌సు దృష్ట్యా 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో కొన‌సాగ‌డంపై కొంత‌కాలంగా అనుమానం నెల‌కొంది. అయితే, త‌న‌దైన బాడీ ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేసే విరాట్ ఈ విష‌యంలో ఇప్ప‌టికీ కుర్రాళ్ల‌కు పోటీ ఇస్తున్నాడు. ఈ క్ర‌మంలో 2027 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడ‌తాడా లేదా అని ఇన్నాళ్లు అభిమానుల్లో నెల‌కొన్న‌ సందేహాన్ని అత‌డే స్వ‌యంగా నివృత్తి చేశాడు. దీంతో కింగ్ కోహ్లీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విరాట్ కోహ్లీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆకట్టుకున్న విష‌యం తెలిసిందే. దాయాది పాకిస్థాన్ పై సెంచ‌రీ, ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఫెయిల్ అయినప్పటికీ, కోహ్లీ టోర్నమెంట్‌లో అద్భుతమైన గ‌ణాంకాలను నమోదు చేశాడు. 54.50 సగటు, 82.89 స్ట్రైక్ రేట్‌తో 218 పరుగులు చేశాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ 18వ సీజ‌న్‌లోనూ అద‌ర‌గొడుతున్నాడు. కేకేఆర్‌తో జ‌రిగిన‌ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే అతడు హాఫ్ సెంచ‌రీ బాదాడు. 




More Telugu News