పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సెల్‌ఫోన్ వెలుగు కాపాడింది!

  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 3 లక్షలు నష్టపోయిన యువకుడు
  • అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యకు యత్నం
  • పట్టాలపై పడుకుని చివరిసారి సోదరికి ఫోన్ 
  • ఫోన్ వెలుగును గుర్తించి రక్షించిన పోలీసులు
బెట్టింగ్‌లో లక్షల రూపాయలు నష్టపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. రాత్రివేళ పట్టాలపైకి చేరాడు. చివరిసారి సోదరితో మాట్లాడి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాలనుకున్నాడు. పట్టాలపై పడుకునే సోదరితో మాట్లాడాడు. అతడు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన సెల్‌ఫోన్ వెలుగు అతడి ప్రాణాలు కాపాడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (31) కొన్ని రోజుల క్రితం ఉద్యోగం మానేశాడు. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి రూ. 3 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. వారి నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో మరో మార్గం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.

గురువారం రాత్రి 10 గంటల  సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. స్టేషన్ శివారుకు వెళ్లి పట్టాలపై పడుకున్నాడు. అయితే, సోదరి గుర్తు రావడంతో ఆమెకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. క్రికెట్ బెట్టింగ్ కోసం స్నేహితుల వద్ద అప్పులు చేసినట్టు చెప్పాడు. ఆ డబ్బులు తాను చెల్లిస్తానని, ఇంటికి రావాలని ఆమె కోరింది. ఈ క్రమంలో వారి మధ్య ఫోన్ సంభాషణ జరుగుతోంది. 

అదే సమయంలో సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫాం చివరలో జీఆర్పీ కానిస్టేబుల్ సైదులు, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురేశ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో పట్టాలపై సెల్‌ఫోన్ వెలుగు కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడకు వెళ్లి చూడగా పట్టాలపై పడుకొని ఫోన్ మాట్లాడుతున్న యువకుడు కనిపించాడు. అతడిని పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించారు.


More Telugu News