పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలన్న జేడీఎస్ ఎమ్మెల్యే

JDS MLA Demands Free Liquor for Men in Karnataka
  • కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్ ఎమ్మెల్యే వింత ప్రతిపాదన
  • ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ మంత్రి
  • వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన మహిళా ఎమ్మెల్యేలు
కర్ణాటక అసెంబ్లీలో ఒక సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే వినూత్న డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మద్యం ఆదాయంతో మహిళలకు నెలకు రూ.2 వేలు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో పురుషులకు వారానికి రెండు బాటిళ్ల ఉచిత మద్యం ఇవ్వాలని జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప డిమాండ్ చేశారు.

కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారన్నారు. ఇందు కోసం మళ్లీ పన్నులు పెంచాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నానని, అభ్యంతరం చెప్పవద్దన్న ఎమ్మెల్యే కృష్ణప్ప .. మద్యం ఆదాయంతో మహిళలకు రూ.2 వేలు, ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇస్తోందని, అలానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోందన్నారు.

మందుబాబులకు ఏమీ ఇవ్వడం లేదు కాబట్టి మద్యం తాగే వారికి ప్రతి వారం రెండు మద్యం బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మహిళా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత, ఇంధన మంత్రి కె.జె జార్జ్ స్పందిస్తూ దీన్ని మీరు ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమలు చేయండని సూచించారు. ప్రజలు మద్యం తక్కువ తాగేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు.

మరో పక్క జేడీఎస్ ఎమ్మెల్యే వింత ప్రతిపాదన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే తాజా ప్రతిపాదన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మందుబాబులను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఉచిత మద్యం హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. 
Go Back to Shorts
JDS MLA
Karnataka Assembly
Free Liquor
Excise Revenue
Siddharamaiah
Controversial Demand
Social Media
Women MLAs Protest
Free Alcohol

More Telugu News