భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్

  • ఫైనల్‌లో విండీస్‌ను మట్టికరిపించిన సచిన్ సేన
  • 6 వికెట్ల తేడాతో ఘన విజయం
  • 74 పరుగులతో మెరిసిన అంబటి రాయుడు
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎంఎల్) 2025 విజేతగా భారత్ అవతరించింది. సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని భారత మాస్టర్స్ జట్టు ఫైనల్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ 45 పరుగులు చేయగా, ఎల్. సిమన్స్ 57 పరుగులు చేశారు. 

అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియన్ మాస్టర్స్ జట్టు 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అంబటి రాయుడు 50 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేయగా, కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. 

యువరాజ్- టినో బెస్ట్ మధ్య గొడవ
ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, విండీస్ ఆటగాడు టినో బెస్ట్ మధ్య జరిగిన గొడవ మ్యాచ్‌లో ఉద్రిక్తతకు కారణమైంది. ఇద్దరూ మాటలు విసురుకుంటూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో విండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించాడు. అంబటి రాయుడు కూడా అక్కడికి చేరుకుని గొడవ ఆపేయాలని టినోను కోరాడు.  

గొడవకు కారణం ఇదే
బెస్ట్ తన ఓవర్‌ను పూర్తిచేసిన తర్వాత గాయం కారణంగా మైదానం వీడాలని అనుకున్నాడు. గమనించిన యువరాజ్ సింగ్ ఈ విషయాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అంపైర్ బిల్లీ బౌడెన్ జోక్యం చేసుకుని వెనక్కి రావాల్సిందిగా బెస్ట్‌ను కోరాడు. దీనికి యువరాజ్ సింగే కారణమని భావించిన బెస్ట్.. అతడి వద్దకు వచ్చి మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకపోవడంతో బ్రియాన్ లారా జోక్యం చేసుకుని విడిపించాల్సి వచ్చింది.  


More Telugu News